- Home
- Automobile
- Bikes
- ABS System: బైక్స్‌లో ఉండే ABS బ్రేక్ సిస్టమ్ అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏంటో తెలుసా?
ABS System: బైక్స్‌లో ఉండే ABS బ్రేక్ సిస్టమ్ అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏంటో తెలుసా?
ABS System: ప్రస్తుతం వస్తున్న దాదాపు అన్ని రకాల బైక్స్‌లో ఏబీఎస్ అనే ఫీచర్ వస్తోంది. అయితే చాలా మందికి ఈ ఫీచర్ ఉపయోగం ఏంటో తెలియదు. ఇంతకీ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) అంటే ఏంటి.? దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ABS అంటే ఏంటి?
ABS అనేది Anti-lock Braking System. బైక్‌కు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే చక్రాలు పూర్తిగా లాక్ కావకుండా అడ్డుకునే భద్రతా వ్యవస్థ ఇది. చక్రాలు లాక్ అయితే బైక్ స్లిప్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ABS ఈ పరిస్థితిని నివారించి రైడర్‌కు నియంత్రణలో బైక్ ఆపే అవకాశం ఇస్తుంది.
బైక్‌లో ABS ఎలా పని చేస్తుంది?
ABSలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి – వీల్ స్పీడ్ సెన్సర్, ECU (ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్), బ్రేక్ సిస్టమ్. వీల్ స్పీడ్ సెన్సర్ వీల్ తిరగడాన్ని నిరంతరం గమనిస్తుంది. వీల్ లాక్ అవుతోందని గుర్తిస్తే ECUకి సంకేతం పంపుతుంది. ECU క్షణాల్లోనే బ్రేక్ ప్రెజర్‌ను తగ్గించి మళ్లీ పెంచుతుంది. ఈ ప్రక్రియ మిల్లీసెకన్లలో జరుగుతుంది. ఫలితంగా చక్రం తిరుగుతూనే ఉంటుంది, బైక్ స్లిప్ కాకుండా సాఫీగా ఆగుతుంది.
బైక్‌లలో ABS ఎందుకు అవసరం?
అత్యవసర బ్రేకింగ్ సమయంలో బైక్ నియంత్రణ కోల్పోవడమే ఎక్కువ ప్రమాదాలకు కారణం. ABS ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. భారత్‌లో 150cc పైబడిన బైక్‌లకు ABS తప్పనిసరి చేశారు. ఖర్చు కొంచెం పెరిగినా, రోడ్డుపై భద్రత దృష్ట్యా ఇది చాలా కీలకమైన ఫీచర్.
దీంతో ఉపయోగాలు ఏంటి.?
అకస్మాత్తు బ్రేకింగ్‌లో స్లిప్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. తక్కువ దూరంలో బైక్ ఆగే సామర్థ్యం పెరుగుతుంది. తడి రోడ్లపై కూడా మెరుగైన నియంత్రణ ఉంటుంది. టైర్లు, బ్రేక్ ప్యాడ్లపై ఒత్తిడి తగ్గుతుంది. బైక్ రీసేల్ విలువ మెరుగ్గా ఉంటుంది.
సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS తేడా ఏంటి.?
సింగిల్ ఛానల్ ABS సాధారణంగా ముందు చక్రానికి మాత్రమే పని చేస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ముందు చక్రం, వెనుక చక్రం రెండింటికీ విడివిడిగా పని చేస్తుంది. దీని వల్ల బ్రేకింగ్ మరింత సమర్థంగా ఉంటుంది. అధిక వేగంతో ప్రయాణించే బైక్‌లకు డ్యూయల్ ఛానల్ ABS ఎక్కువ భద్రత ఇస్తుంది.

