- Home
- Automobile
- Car Sunroof: కారుకు బయట సన్ రూఫ్ వేయిస్తే వారంటీ పోతుందా? ఇన్సూరెన్స్‌లో కూడా చిక్కులేనా?
Car Sunroof: కారుకు బయట సన్ రూఫ్ వేయిస్తే వారంటీ పోతుందా? ఇన్సూరెన్స్‌లో కూడా చిక్కులేనా?
Car Sunroof: కారు కంపెనీలు కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్లను డిజైన్ చేస్తాయి. అయితే బయట మార్కెట్లో సన్‌రూఫ్ వేయిస్తే కారు వారంటీ పోతుందా అనే సందేహం ఉంటుంది. ఇందులో వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.

కారుకు బయట సన్‌రూఫ్ వేయించడం మంచిదేనా?
కారు కంపెనీలు కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్లను డిజైన్ చేస్తాయి. అయితే బయట మార్కెట్లో సన్‌రూఫ్ వేయిస్తే కారు వారంటీ పోతుందా అనే సందేహం ఉంటుంది. ఇందులో వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.
కార్లను మాడిఫై చేయడం ఇప్పుడు పెద్ద ట్రెండ్. కుర్రాళ్లు కొత్త లైట్లు, పెద్ద స్క్రీన్లు, అల్లాయ్ వీల్స్ వేయిస్తున్నారు. కంపెనీ సన్‌రూఫ్ ఇవ్వకపోతే, బయట యాక్సెసరీస్ షాపుల్లో సన్‌రూఫ్ వేయిస్తున్నారు. ఈ పని కారు లుక్ మార్చినా, వారంటీకి ఎసరు పెడుతుందని చాలామందికి తెలియదు.
ఆఫ్టర్‌మార్కెట్ సన్‌రూఫ్ వేయాలంటే మెకానిక్‌లు కారు పైకప్పును కట్ చేస్తారు. ఇది మామూలు ప్లగ్ అండ్ ప్లే పని కాదు. కారు బాడీని కట్ చేయడం, డ్రిల్లింగ్, వెల్డింగ్ లాంటి పనులు చేస్తారు కాబట్టి వారంటీకి కచ్చితంగా చిక్కులు వస్తాయి.
వారంటీ రద్దవుతుందా?
బయట సన్‌రూఫ్ వేయించినప్పుడు, మెకానిక్‌లు ఏ పార్టును మారుస్తారో ఆ పార్టు వారంటీకి ఇబ్బంది వస్తుంది. పైకప్పును కట్ చేసినప్పుడు, ఆ చోట నీరు లీక్ అవ్వొచ్చు. తుప్పు పట్టొచ్చు లేదా కారు బాడీకి వేరే సమస్యలు రావచ్చు. ఇలా జరిగితే, కంపెనీలు వారంటీ కింద ఫ్రీగా రిపేర్ చేయవు. అయితే దీనివల్ల ఇంజిన్ లేదా సన్‌రూఫ్‌తో సంబంధం లేని ఇతర పార్టుల వారంటీ ఆటోమేటిక్‌గా రద్దవ్వదు.
రూఫ్ కటింగ్ పెద్ద సమస్య
కంపెనీలు కారు బాడీని, పైకప్పును ఫ్యాక్టరీలోనే ఒక పక్కా డిజైన్‌లో తయారు చేస్తాయి. బయట సన్‌రూఫ్ కోసం దాన్ని కట్ చేసినప్పుడు, కారు ఒరిజినల్ డిజైన్ మారిపోతుంది. సన్‌రూఫ్ వేసేటప్పుడు సీలింగ్, నీరు బయటకు వెళ్లే డ్రైనేజ్ సిస్టమ్‌లో కూడా మెకానిక్‌లు మార్పులు చేస్తారు. ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే, వాన నీరు కారులోకి వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు తేమ ఉంటే, కారులోని ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా పాడవుతుంది.
వారంటీ పాలసీని గమనించండి
ఒక్కో కారు కంపెనీ వారంటీ రూల్స్ ఒక్కోలా ఉంటాయి. కొన్ని కంపెనీలు కారు ఒరిజినల్ డిజైన్ మారిస్తే వారంటీని తీసేస్తాయి. మరికొన్ని కంపెనీలు, అనుమతి లేని మార్పులు లేదా తప్పుడు రిపేర్ల వల్ల వచ్చే డ్యామేజీలకు వారంటీ ఇవ్వవు. కాబట్టి, బయట సన్‌రూఫ్ వేయించిన వెంటనే కారు మొత్తం వారంటీ పోతుందని చెప్పలేం. కానీ సన్‌రూఫ్ వల్ల వచ్చే డ్యామేజీలకు మాత్రం కంపెనీలు వారంటీ క్లెయిమ్ ఇవ్వవు.
కొత్త కారులో మీరు ఇలాంటి మార్పు చేయాలనుకుంటే, ముందుగా మీ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర రాతపూర్వకంగా లెటర్ తీసుకోండి. యాక్సెసరీస్ షాపు వాళ్లు 'వారంటీకి ఏమీ కాదు' అని చెబితే గుడ్డిగా నమ్మకండి. కంపెనీ పర్మిషన్, ఫిట్టింగ్ కండిషన్స్ ఉంటే, వాటిని మీరు జాగ్రత్తగా దాచుకోండి.
ఇన్సూరెన్స్‌లో కూడా చిక్కులే
సన్‌రూఫ్ వేయించడం వల్ల వారంటీకే కాదు, కారు ఇన్సూరెన్స్‌కు కూడా చిక్కులు వస్తాయి. కారులో పెద్ద మార్పులు చేసినప్పుడు, ఆ విషయాన్ని మీరు కచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి.





