VinFast VF5 : ఫుల్ ఛార్జ్‌తో 326 కి.మీ రేంజ్... టాటా పంచ్ కే ఈ కారు పంచ్ ఇవ్వనుందా?
వియత్నాంకి చెందిన విన్‌ఫాస్ట్ కంపెనీ తమ కొత్త VF5 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ SUV కారును వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కారు ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది
ఇండియన్ ఎలక్ట్రిక్ మార్కెట్లో టాటా మోటార్స్, మహీంద్రా లాంటి దేశీయ కంపెనీలకు పోటీగా విదేశీ కంపెనీలు కూడా కొత్త మోడళ్లను దించుతున్నాయి. ఇలా ఇప్పటికే 2 ఎలక్ట్రిక్ కార్లతో భారత్‌లో వ్యాపారాన్ని మొదలుపెట్టిన వియత్నాంకి చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) సంస్థ ఇప్పుడు మరో కొత్త కారును రంగంలోకి దింపేందుకు సిద్దమయ్యింది. VF5 ఎలక్ట్రిక్ SUV కారును త్వరలో ఇండియాలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. దీని డిజైన్ పేటెంట్ ఇండియాలో ఫైల్ అయిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ కారు టెస్ట్ డ్రైవ్ చేస్తున్న స్పై (Spy) ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి.
ఎక్స్టీరియర్ డిజైన్ మార్పులు
ఫ్రంట్ - ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే కొత్త ఫేస్‌లిఫ్ట్ కారు ముందు భాగం చాలా స్టైలిష్‌గా మారింది. సన్నటి హెడ్లైట్లు, బంపర్‌కు ఇరువైపులా కింది భాగంలో హెడ్‌ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, తక్కువ బ్లాక్ కలర్ డెకరేటివ్ పార్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా బానెట్ డిజైన్ కూడా మారడంతో, పాత మోడల్ కంటే ఇది పక్కా SUV లుక్‌ని సొంతం చేసుకుంది.
సైడ్ డిజైన్ - సైడ్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, వియత్నాంలో వచ్చిన స్పై ఫోటోల ప్రకారం ఇందులో కొత్త 16 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఇచ్చే అవకాశం ఉంది.
రియర్ - వెనుక భాగంలో మందపాటి కొత్త LED టైల్ లైట్లు ఉంటాయి. వీటి మధ్యలో ఒక లైట్ బార్, దాని సెంటర్లో విన్‌ఫాస్ట్ లోగో ఉండే ఛాన్స్ ఉంది.
కొలతలు - కారు కొలతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత మోడల్ 3,967 mm పొడవు, 1,723 mm వెడల్పు, 1,580 mm ఎత్తు, 2,514 mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది.
ఇంటీరియర్ ఫీచర్లు
బయటి వైపు లాగానే లోపల కూడా కొత్త డాష్‌బోర్డ్ సెటప్‌తో పాటు కీలక మార్పులు చేశారు. ప్రస్తుతమున్న చిన్న స్క్రీన్‌కి బదులుగా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌తో ఇంటిగ్రేట్ చేసిన సెటప్, కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండొచ్చు. అంతేకాదు సెంటర్ కన్సోల్‌లో రోటరీ గేర్, 2 కప్ హోల్డర్లు ఇచ్చే అవకాశం ఉండగా, ఇంటీరియర్‌లో బ్లాక్ కలర్ డెకరేషన్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నారు.
బ్యాటరీ & పెర్ఫార్మెన్స్ వివరాలు
గ్లోబల్ మార్కెట్లలో విన్‌ఫాస్ట్ VF5 రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో సేల్ అవుతోంది.
29.6 kWh బ్యాటరీ - ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 90 hp పవర్‌ను, 135 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌తో 268 కి.మీ వరకు ప్రయాణిస్తుంది (NEDC సర్టిఫికేషన్).
37.23 kWh బ్యాటరీ - ఇది ఫుల్ ఛార్జ్‌తో 326 కి.మీ రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. అయితే ఇండియన్ మోడల్లో ఏ బ్యాటరీ ఇస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
కొత్త విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఇండియాలో అమ్మకానికి వస్తుందని అంచనా. ఇండియన్ మార్కెట్లో ఈ కారు 30 kWh, 45 kWh బ్యాటరీ ఆప్షన్లతో దొరికే టాటా నెక్సాన్ EVకి గట్టి పోటీ ఇస్తుంది. అలాగే టాటా పంచ్ EV మార్కెట్‌ను కూడా ఇది టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.













