Dream Astrology: కలలో చనిపోయిన బంధువులు కనిపిస్తే శుభమా? అశుభమా?
Dream Astrology: ఒక్కోసారి రకరకాల కలలు వస్తాయి. అందులో చనిపోయిన బంధువులు కూడా కనిపిస్తూ ఉంటారు. అలాంటి కల రావడం మంచిదో కాదు అని ఆలోచించేవారు ఎంతోమంది. మన హిందూ ధర్మ శాస్త్రాలు, స్వప్న శాస్త్రం ఈ విషయంలో ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.

కలలో పూర్వీకులు కనిపిస్తే...
చాలామందికి కలలు రావడం సహజం. అయితే నిద్రలో మరణించిన బంధువులు కనిపిస్తుంటారు. తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా పూర్వీకులు కనిపిస్తూ ఉంటారు. ఇలా కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా? అని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలోకి వచ్చే అంశాలు.. మనసులోని ఆలోచనలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో అవి కొన్ని సంకేతాలుగా కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పూర్వీకులు కలలో కనిపించడం అన్నది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోండి.
పూర్వీకులు ఏడుస్తూ కనిపిస్తే
స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం కలలో పూర్వీకులు సంతోషంగా కనిపిస్తే అది శుభ సూచకంగానే భావించాలి. వారు నవ్వుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే.. మీ కుటుంబం పై వారి కృప ఉందని అర్థం. ఇలాంటి కల వచ్చిన వారికి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఉన్న ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక పూర్వీకులు కలలో ఏడుస్తూ, బాధగా, మౌనంగా కూర్చుని కనిపిస్తే అది హెచ్చరికగానే అర్థం చేసుకోవాలని చెబుతోంది స్వప్న శాస్త్రం. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చే ముందు ఇలా పూర్వీకులు కనిపిస్తూ ఉంటారని వివరిస్తోంది. ముఖ్యంగా ఇంట్లోనే అనవసర గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చే ముందు ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కలలు వచ్చాక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆహారం అడిగితే
అలాగే పూర్వీకులు కలలో వచ్చి ఆహారం, నీరు వంటివి అడగడం, ఏదైనా మిమ్మల్ని కావాలని కోరడం వంటివి చేస్తే దానికి కూడా ప్రత్యేకమైన అర్థం ఉంది. స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం తమ తీరని కోరికను వారు చెప్పడమేనని అర్థం. అంటే పూర్వీకులు తమ తరపున ఏదైనా కార్యం చేయాల్సి ఉంటే అది చెయ్యమని వారు అడుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. అది దానం కావచ్చు, తర్పణం కావచ్చు. ఇలా చేయడం వల్ల వారి మనస్సు తృప్తి పొందుతుంది. కుటుంబంలో ప్రతికూలతలు కూడా తగ్గుతాయి.
పితృపక్షం కాలంలో వస్తే
పితృపక్షం సమయంలో పూర్వీకులు కలలో కనిపించారంటే మరింత ప్రాధాన్యంగా భావించాలి. పితృపక్షం అనేది పూర్వీకులను స్మరించుకునే సమయం. అప్పుడు కలలో పెద్దలు రావడం అంటే వారు మనతో అనుబంధం కోరుకుంటున్నారని, తమను గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నట్టు అర్థం. ఆరోజు పితృదేవతల కోసం ప్రార్థనలు చేయడం, అన్నదానం చేయడం వంటివి చేస్తే ఎంతో మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో పూర్వీకులు కలలో వచ్చినా ఏమీ మాట్లాడకుండా తదేకంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నట్టు కనిపిస్తారు. ఇలా కల వస్తే మన ప్రవర్తనను సరి చేసుకోమని వారు చెబుతున్నట్టే. ముఖ్యంగా కుటుంబ విలువలు, సంప్రదాయాలు విషయంలో ప్రవర్తనను మార్చుకోమని చెప్పడమే. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వ్యక్తి మనస్తత్వంతో ముడిపడి ఉంటాయి. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం మాత్రమే ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఒక్కసారి మీరు చేసే పనులు చేయబోయే పనులను పరిశీలన చేసుకోవాలి.

