Gold Astrology: ఈ గ్రహం అనుగ్రహం ఉంటే మీ ఇల్లు బంగారంతో నిండిపోవడం ఖాయం!
సాధారణంగా కొందరి జీవితంలో సంపద, అదృష్టం ఒక్కసారిగా కలిసివస్తాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే కష్టంతో పాటు గ్రహాల అనుగ్రహం కూడా ఇందుకు కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏ గ్రహం అనుగ్రహం ఉంటే ధనం ప్రవాహంలా వచ్చి చేరుతుందో ఇక్కడ చూద్దాం

Gold Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల జీవితంలో ధనం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలపై ప్రధానంగా ప్రభావం చూపే కొన్ని గ్రహాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది గురు గ్రహం. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే చాలు.. మీ ఇల్లు బంగారంతో నిండిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. పండితుల ప్రకారం.. గురువు అనుగ్రహం కలిగిన జాతకులకు జీవితంలో ధనాభివృద్ధి మాత్రమే కాదు, గౌరవం, స్థిరత్వం, శుభఫలితాలు సహజంగా లభిస్తాయి.
గురుగ్రహం అనుగ్రహంతో..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు ధనానికి మాత్రమే కాదు జ్ఞానం, ధర్మం, అదృష్టానికి కూడా కారకుడు. అందుకే గురువు బలంగా ఉన్న జాతకులకు కష్టకాలంలోనూ అదృష్టం సహకరిస్తుంది. వారు చేసే ప్రయత్నాలకు సరైన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం, పెట్టుబడులు వంటి విషయాల్లో గురుగ్రహం అనుగ్రహం ఉన్నవారు వేగంగా ఎదుగుతారని, వారి ఇంట్లో ధన ప్రవాహం ఆగకుండా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు.
గురు గ్రహం ఈ స్థానాల్లో ఉంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో గురుగ్రహం రెండవ స్థానం, ఐదవ స్థానం, తొమ్మిదవ స్థానం లేదా పదకొండవ స్థానంలో బలంగా ఉంటే ధన యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా రెండవ స్థానం కుటుంబ ధనం, వాక్కు, సంపదను సూచిస్తే, పదకొండవ స్థానం లాభాలను సూచిస్తుంది. ఈ స్థానాల్లో గురు గ్రహం ఉండటం వల్ల ఆదాయం పెరగడమే కాదు.. భవిష్యత్తు కోసం పొదుపు కూడా చేస్తారు.
గురు, శుక్రుల యోగం..
గురు గ్రహంతో పాటు శుక్ర గ్రహం కూడా ఐశ్వర్యానికి కారకుడు. శుక్రుడు సుఖాలు, విలాసాలు, భౌతిక ఆనందాలకు సూచిక. ఒక వ్యక్తి జాతకంలో గురు–శుక్రుల యోగం ఏర్పడితే వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. విలాసవంతమైన జీవితం, బంగారం, విలువైన వస్తువులు సంపాదించే యోగం కలుగుతుందని వివరిస్తున్నారు.
గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే?
జ్యోతిష్య పండితుల ప్రకారం, గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, పేదలకు అన్నదానం చేయడం వంటివి గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడతాయి. అలాగే గురువుల పట్ల గౌరవం చూపించడం, పెద్దల ఆశీర్వాదాలు పొందడం కూడా ఎంతో ముఖ్యమని పండితులు చెబతున్నారు.

