Dream Astrology: పదే పదే బాల్యం కలలో వస్తే అర్థమేంటి? నిజ జీవితంలో ఏం జరుగుతుంది?
చాలామందికి కలలో చిన్ననాటి జ్ఞాపకాలు, పెరిగిన ఇల్లు, తిరిగిన వీధులు, ఆటలు, స్నేహితులు, నవ్వులు కనిపిస్తుంటాయి. అది కలే అయినా ఒక్కసారి మనసు ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. ఇలా కలలో పదే పదే బాల్యం కనిపిస్తే అర్థం ఏంటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

Dream Astrology
స్వప్న శాస్త్రం ప్రకారం.. పదే పదే బాల్యం కలలో రావడం సాధారణంగా తీసుకునే విషయం కాదు. నిజానికి కలలు మన అచేతన మనస్సు మాట్లాడే భాష. బాల్యం అంటే మన జీవితంలో అత్యంత స్వచ్ఛమైన, భయం లేని, బాధ్యతలు తక్కువగా ఉన్న దశ. అలాంటి బాల్యం మళ్లీ మళ్లీ కలలో కనిపిస్తే, అది మన ప్రస్తుత జీవిత పరిస్థితులపై మన అంతర్మనస్సు చేస్తున్న వ్యాఖ్యగా స్వప్న శాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా ఒత్తిడి, బాధ్యతలు, నిర్ణయాల భారం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ రకమైన కలలు ఎక్కువగా వస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది.
వాటిని తట్టుకోలేకపోయినప్పుడు..
స్వప్నశాస్త్రం ప్రకారం, ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, బాధ్యతలు లేదా భావోద్వేగ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నప్పుడు, మనస్సు సురక్షితంగా అనిపించిన గతానికి పరుగులు తీస్తుంది. బాల్యం అంటే భద్రత, ప్రేమ, ఆమోదం. కాబట్టి ఈ కలలు వచ్చే వ్యక్తి లోపల ఎక్కడో ఒక చోట “నాకు విశ్రాంతి కావాలి” అనే భావన దాగి ఉండొచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది.
చంద్రుడి ప్రభావంతో..
జ్యోతిష్య పండితుల ప్రకారం, బాల్యం కలలో పదే పదే కనిపించడం చంద్రుడి ప్రభావంతో సంబంధం కలిగి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా గ్రహచారాల్లో మనస్సుపై ఒత్తిడి పెరిగినప్పుడు, పాత జ్ఞాపకాలు, ముఖ్యంగా బాల్య జ్ఞాపకాలు కలల రూపంలో బయటకు వస్తాయి. ముఖ్యంగా కర్కాటక, మీన రాశి వారికి, లేదా చంద్ర దశ బలహీనంగా ఉన్నవారికి ఈ కలలు ఎక్కువగా రావచ్చని పండితులు చెబుతున్నారు.
ఈ సంకేతం కూడా
బాల్యం కలలో రావడం అంటే, మనలో ఉన్న అసలైన మనిషిని మనమే మర్చిపోయామన్న సంకేతం కూడా కావచ్చని కొంతమంది పండితులు చెబుతున్నారు. బాల్యంలో మనం స్వచ్ఛంగా నవ్వుతాము, భయం లేకుండా మాట్లాడుతాము, ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆలోచించము. కానీ ఇప్పుడు ఆ స్వభావం కనుమరుగైపోయిందని గుర్తు చేయడానికి మన మనస్సు ఈ విధమైన కలలను చూపుతుందని పండితులు సూచిస్తున్నారు.
పరిష్కారం కాని సమస్యలు
కొన్ని సందర్భాల్లో బాల్యం కలలో రావడం ఒక హెచ్చరిక కూడా కావచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. బాల్యంలో ఎదురైన ఏదైనా బాధ, చెప్పుకోలేని భయం మనలో ఇంకా పరిష్కారం కాకుండా మిగిలి ఉంటే, అది కలల రూపంలో మళ్లీ మళ్లీ బయటపడుతుంది. ముఖ్యంగా ఒకే సంఘటన, ఒకే ప్రదేశం లేదా ఒకే వ్యక్తి కలలో కనిపిస్తుంటే, ఇంకా మన లోపల హీలింగ్ జరగలేదని సూచన. అలాంటి భావాలను గుర్తించి, అంగీకరించి, వదిలేయాల్సిన అవసరం ఉందని స్వప్నశాస్త్రం సూచిస్తోంది.
పరిశీలనతో చూడాలి
స్వప్నశాస్త్రం ప్రకారం కలలను భయంతో కాకుండా పరిశీలనతో చూడాలి. బాల్యం కలలో వచ్చినప్పుడు, “నేను ఇప్పుడు ఏ విషయంలో ఒత్తిడికి లోనవుతున్నాను?”, “నా జీవితంలో ఏ ఆనందాన్ని కోల్పోయాను?” వంటి ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. సమాధానాలు దొరికినప్పుడు, ఈ కలల తీవ్రత తక్కువవుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

