Sun and Cow: మీ జాతకంలో సూర్యుడు బలం పెంచేందుకు ఆవుకి ఈ ఆహారాలు తినిపించండి
Sun and Cow: ఒకరి జీవితం లో సూర్యుడు బలంగా ఉంటే అతడి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. సూర్యుడిని బలంగా మార్చేందుకు పండితులు చెబుతున్న ప్రకారం కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిలో ఆవుకి ఆహారం తినిపించడం ఒకటి. ఎలాంటి ఆహారాలు ఆవుకి తినిపించాలో తెలుసుకోండి.

సూర్యుడు ముఖ్యమైన గ్రహం
జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు ముఖ్యమైన గ్రహం. సూర్యుడే జీవశక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను, గౌరవాన్ని, గొప్ప పేరును అందిస్తాడు. తండ్రితో అనుబంధానికి కూడా సూర్యుడే కారణం. ప్రభుత్వ సంబంధిత విషయాలు కూడా సూర్యుడితోనే అనుబంధం కలిగి ఉంటాయి. సూర్యుడు బలంగా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకరి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే జీవితంలో వారు నిర్ణయాలు తీసుకోలేరు. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గౌరవం కూడా తగ్గుతుంది. వారిపై వారికి నమ్మకం ఉండదు. అందుకే సూర్యడి బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆవుకు ఆహారం తినిపించడం.
ఆవులోనే సర్వదేవతలు
హిందూ సంప్రదాయం ప్రకారం ఆవు ఎంతో పవిత్రమైన జంతువు. ఆవును దేవతగా కొలుస్తారు. సర్వదేవతలు ఆవులోనే నివసిస్తారని అంటారు. అంతేకాదు సూర్యుడి శక్తి ఆవుతో ముడిపడి ఉందని నమ్ముతారు. అందుకే ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా సూర్యగ్రహ దోషాలను నివారించుకోవచ్చు అని చెబుతారు. జీవితంలో సానుకూల మార్పులు వచ్చేందుకు కూడా ఆవుకి ఆహారం తినిపించడం ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. సూర్యుడు ఉదయించే సమయానికి ఆవుకి ఆహారం పెట్టడం ఎంతో శుభప్రదం. ఈ సమయంలో మనసులో మంచి ఆలోచనలే ఉంటాయి. ఎలాంటి చెడు ఆలోచనలు రావు. ఆ సమయంలో సూర్యుడిని స్మరిస్తూ ఆవును ప్రేమగా పిలిచి ఆహారం తినిపిస్తే మంచిది. దీని వల్ల గ్రహ పరిహారమే కాదు.. మూగజీవుల పట్ల ప్రేమ, కరుణా కూడా చూపించిన వాళ్ళం అవుతాము.
ఆవుకు పెట్టాల్సిన ఆహారాలు
అయితే ఆవుకు ఎలాంటి ఆహారాలను పెడితే సూర్యగ్రహబలాన్ని బలపరుచుకోవచ్చో తెలుసుకోండి. ఆవుకి పెట్టాల్సిన ఆహారాల్లో ముఖ్యమైనవి గోధుమలు. గోధుమలు శక్తికి, స్థిరత్వానికి ప్రతీక. ఆవుకు గోధుమలు పెట్టడం వల్ల జీవితంలో మీకు ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ప్రమోషన్లు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే బెల్లం కూడా సూర్యుడికి సంబంధించిన ఆహారంగా చెప్పుకుంటారు. బెల్లం శుభ ఫలితాలను అందిస్తుంది. ఆవుకి బెల్లం తినిపించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. చేసే పనుల్లో విజయం దక్కుతుంది. అలాగే ఉప్పు వేయకుండా చేసిన చపాతీ, రొట్టె, పచ్చిగడ్డి వంటివి కూడా వాటికి పెట్టవచ్చు.
మానసిక ప్రశాంతత
ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన మనసుపై సానుకూల ప్రభావం పడుతుంది. ఒక మంచి పని చేస్తున్నామనే ఆలోచన వస్తుంది. దీనివల్ల మనలో దయ, క్రమశిక్షణ పెరుగుతాయి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మాత్రం ఆవుకి ఆహారం పెట్టడం అనేది సూర్యుడి బలాన్ని పెంచుతుంది. అయితే ఆవుకి పెట్టే ఆహారం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. వాటికి హాని చేసే పదార్థాలు ఇవ్వకూడదు. ప్రతిరోజు ఆవుకి ఆహారం తినిపించడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు కలిగే అవకాశం ఉంటుంది.

