Dreams Never share: ఇలాంటి కలలు వస్తే ఎవరితోనూ చెప్పకండి, సీక్రెట్‌గా మీలోనే ఉంచుకోండి
Dreams Never share: జీవితంలో నిద్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ నిద్రలో వచ్చే కలలు కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. కొన్ని రకాల కలలు వచ్చినప్పుడు అవి ఎవరితోనూ చెప్పకూడదని స్వప్న శాస్త్రం వివరిస్తోంది.

ఈ కలలకు అర్థం
స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే మంచి విషయాలకు సంకేతంగా వస్తాయి. అలాంటి కలలు వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే వచ్చిన కలను కొంతమంది చెప్పేస్తుంటారు. అలా చెప్పడం వల్ల రాబోయే శుభ ఫలితాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. మీ కలలో దేవుళ్ళ దర్శనం జరిగితే అది శుభ సూచకం. దేవుడు కలలో కనిపించడం అంటే మీపై ఆ దేవుని కృప ఉందని అర్థం. మీ జీవితంలో మంచి మార్పులు జరగబోతున్నాయని స్వప్న శాస్త్రం వివరిస్తోంది. కలలో దేవుళ్ళు కనిపించగానే ఆ విషయాన్ని ఉదయం లేచి అందరికీ చెప్పెయవద్దు. దాన్ని అలా మనసులోనే ఉంచుకోండి.
ఈ కలలన్నీ రహస్యంగానే
మీ కలలో బంగారం, వెండి, ధనం, ధాన్యంతో నిండిన పాత్రలు కనిపించడం కూడా ఎంతో అదృష్టంగా చెబుతారు. ఇలాంటి కలలు రావడం రాబోయే సంపదకు, అభివృద్ధికి సంకేతంగా భావించవచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వాటిని బయటికి చెప్పకూడదు. అలాగే పండ్లతో నిండిన తోట, పచ్చని చెట్లు, వికసించిన పువ్వులు కూడా కలలో కనిపిస్తే ఎంతో శుభకరం. ఇవి భవిష్యత్తులో మీకు సుఖసంతోషాలను, కుటుంబంలో శాంతిని, మంచి ఉద్యోగాన్ని, వ్యాపారంలో ఎదుగుదలను తెస్తాయని అంటారు. ఈ కలలను ఇతరులకు చెబితే మాత్రం ఆ శుభ ఫలితం ఆగిపోయే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం నమ్మకం. అందుకే ఇలాంటి కలలు వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండడం ఎంతో మంచిది. అద్దంలో మీ ముఖాన్ని మీరే చూసుకున్నట్టు కల వచ్చినా కూడా అది అదృష్ట సూచకగానే భావించాలి. జీవితంలో వచ్చే కొత్త అవకాశాలకు, శుభవార్తలకు దీన్ని సంకేతంగా చెప్పుకోవాలి. ఈ కలను కూడా ఎవరికి చెప్పకూడదు.
మరణించినట్టు కల వస్తే
కలలో ఎవరైనా దగ్గర వ్యక్తి మరణించినట్టు లేదా స్వయంగా తానే మరణించినట్టు కల వస్తే ఎంతోమంది భయపడిపోతారు. కానీ స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇది నిజమైన మరణానికి సంకేతం కాదు. జీవితంలో వచ్చే పెద్ద మార్పులు, కొత్త ప్రారంభాలకు సూచనగా చెప్పుకోవాలి. ఇన్నాళ్లు వేధిస్తున్న పాత సమస్యలకు ముగింపు పలికే రోజు వస్తోందని అర్థం. ఇక్కడ చెప్పిన ఏ కలలను కూడా ఇతరులతో పంచుకోకూడదు. అలా చెప్పడం వల్ల వాటి ప్రభావం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది . స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం పైన చెప్పిన కలలను శుభకరమైనవి. దైవ దర్శనం, ధనం, పచ్చదనం, అద్దంలో ముఖం కనిపించడం, మరణం వంటివన్నీ కూడా రహస్యంగా ఉంచాల్సిన కలలు.

