Chiraneevi: తన విలన్ ప్రాణాలు కాపాడడానికి 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన చిరంజీవి
Chiraneevi: చిరంజీవి చేసే ఎన్నో మంచి పనులు బయటికి తెలియదు. ఆ సహాయాన్ని అందుకున్న వారు అందరికీ చెప్పినప్పుడే తెలుస్తుంది. అలా చిరంజీవి తన సినిమాల్లో విలన్ గా నటించినా వ్యక్తిని కాపాడేందుకు ఏకంగా 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.

విలన్ ప్రాణాలు కాపాడిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తనతో పాటు నటించిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వారు సాయం అడిగితే వెంటనే చేస్తారని నమ్మకం ఎంతో మందిలో ఉంది. అలాగే తన సినిమాల్లో విలన్ గా నటించిన పొన్నాంబలం అనే తమిళ నటుడికి చిరంజీవి ఎంతో సాయం చేశారు. ఆయన ప్రాణాలనే కాపాడారు. పొన్నాంబలం తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాష సినిమాల్లో నటించారు. ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశారు. కానీ ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం సాయం చేసింది చిరంజీవేనని ఎన్నోసార్లు మీడియాకు తెలియజేశారు. తన ప్రాణాన్ని కాపాడింది చిరంజీవి అన్నయ్య అని.. ఈరోజు బతికున్నానంటే ఆయనే కారణం అని ఎన్నోసార్లు చెప్పారు. చిరంజీవితో పాటు కమలహాసన్, రజినీకాంత్, ధనుష్, రాధికా శరత్ కుమార్, రాఘవ లారెన్స్.. ఇలా ఎంతోమంది సాయం చేసినా పొన్నాంబలం ప్రాణాన్ని కాపాడిన ఘనత మాత్రం చిరంజీవికే దక్కుతుంది.
ఏ సినిమాల్లో నటించారు
పొన్నాంబలం తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి. అలాగే దానికి ఖర్చు కూడా అధికంగానే అవుతుంది. అంత ఖర్చు భరించే స్థితిలో పొన్నాంబలం లేరు. పొన్నాంబలం తన పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ విషయం తెలియగానే చిరంజీవి రెండు లక్షల రూపాయలు అతని బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇందుకోసం పొన్నాంబలం ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఆ తరువాత కూడా కిడ్నీ సమస్య ముదిరిపోయింది. అప్పుడు మళ్లీ చిరంజీవినే సాయం అడిగారు. వీరిద్దరూ ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో కలిసి నటించారు. కరుడుగట్టిన విలన్ గా పొన్నాంబలం ఈ సినిమాల్లో కనిపిస్తారు.
ఖర్చంతా చిరంజీవి అన్నయ్యదే
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పొన్నాంబలం మాట్లాడుతూ తన ప్రాణాన్ని చిరంజీవి ఎలా కాపాడారో వివరించారు. చిరంజీవి నేపాల్ లో ఉన్నప్పుడు అన్నయ్యా కాల్ ఇమీడియట్టీ అని మెసేజ్ పెట్టినట్టు చెప్పారు. 10 నిమిషాల్లో చిరంజీవి తనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని వివరించారు. నేను చూసుకుంటాను, నువ్వు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్ళమని చెప్పారని.. తాను వెంటనే అపోలో ఆసుపత్రికి వెళ్లానని.. అప్పటికే తనకోసం అక్కడ వైద్యులు ఎదురుచూస్తున్నారని వివరించారు. తనకక్కడే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందని చెప్పారు. దాదాపు 45 లక్షల వరకు ఇందుకు ఖర్చయినట్టు వివరించారు. ఆ ఖర్చంతా కూడా చిరంజీవే భరించారని కూడా తెలిపారు. ఆ తర్వాత కూడా తను ఆరోగ్యంగా మారడానికి ఎన్నో పరీక్షలు చేయించాల్సి వచ్చిందని, మందులు వాడాల్సి వచ్చిందని ఆ వైద్య ఖర్చును అంతా కూడా చిరంజీవి భరించారని.. ఇప్పటివరకు 60 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారని పొన్నంబలం వివరించారు.
డయాలసిస్ ఒక నరకం
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కి ముందు మూడేళ్లగా డయాలసిస్ మీదే జీవిస్తున్నట్టు చెప్పారు పొన్నాంబలం. డయాలసిస్ చేసేటప్పుడు రెండుసార్లు సూదులతో రక్తం తీస్తారని, ఆ తర్వాతే డయాలసిస్ చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 750 సార్లు సూదులతో రక్తం తీయించుకున్నానని ఎంతో కష్టంగా ఉండేదని వివరించారు. సాయం అడిగితే చిరంజీవి లక్షో, రెండు లక్షలో ఇస్తారనుకున్నాను కానీ ఏకంగా మొత్తం ఖర్చును ఆయనే భరిస్తారని అనుకోలేదని చెప్పారు. ప్రస్తుతం తాను బతికుండడానికి చిరంజీవి కారణమని వివరించారు.

