- Home
- Andhra Pradesh
- Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Weather Update: తీవ్ర వాయుగుండం బలహీనపడినా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం తీరం దాటినా ఆగని వానలు.. ఏయే జిల్లాలకు అలర్ట్ అంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం చివరికి తీరం దాటింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా, తెలుగు రాష్ట్రాలకు మాత్రం వర్ష గండం ఇంకా పొంచే ఉంది. రాబోయే రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు గట్టి హెచ్చరికలే జారీ చేశారు.
ఏపీని వణికిస్తున్న కుంభవృష్టి.. 8 మంది దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దారుణమైన విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాల తీవ్రతకు గోడలు కూలిపోవడం, విద్యుత్ వైర్లు తెగిపడటం వంటి ప్రమాదాల్లో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కరెంట్ షాక్‌తో ఐదుగురు మరణించగా, కాకినాడలో గోడకూలి ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లాలో భారీ వర్షాల మధ్య చిక్కుకుని ఇద్దరు వృద్ధులు తుదిశ్వాస విడిచారు.
విశాఖపట్నంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎల్బీఎస్ నగర్‌లో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో 14 మందిని అధికారులు కల్యాణ మంటపానికి తరలించారు. ఇక కొమ్మడిలోని ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో మోకాలు లోతు నీరు చేరడంతో 80 మంది నివాసితులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విశాఖలోనే ఏకంగా 71 చెట్లు నేలకూలాయి. ఆర్కే బీచ్ రోడ్డులో కోస్తా తీరం తీవ్రంగా కోతకు గురికాగా, విమాన సర్వీసులు, 170కి పైగా ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు.
నదుల్లో ఉప్పొంగుతున్న వరద
వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార నదులతో పాటు భద్రాచలం, ధవళేశ్వరం, గొట్టా బ్యారేజీల వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అన్ని రిజర్వాయర్లు, చెరువులను నీటితో నింపాలని, అవసరమైన చోట మొబైల్ లిఫ్టులు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదకర ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. వాతావరణ తీవ్రత దృష్ట్యా విశాఖ, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
తెలంగాణలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరోవైపు తెలంగాణలో కూడా వర్షాల హోరు తగ్గడం లేదు. రాగల 24 గంటల్లో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమరం భీం జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 130.3 మి.మీ వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది.
ప్రాజెక్టుల్లో నీటికళ
ఎడతెరిపి లేని వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వైరా రిజర్వాయర్ అలుగులు పారుతుండగా, తాలిపేరు 8 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి మట్టం 16.80 అడుగులకు చేరింది. మూసీ, పెదవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులు సైతం నిండు కుండల్లా మారాయి. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తాత్కాలికంగా ఆటంకం కలిగింది.
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, ఈ డిప్రెషన్ ప్రభావం శుక్రవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గనుంది. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు రాష్ట్రంలో వర్షాలకు చిన్నపాటి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. అయితే ఆ సమయంలో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉక్కపోత ఇబ్బంది పెడతాయి. మళ్లీ అక్టోబర్ 3 నుంచి 13 మధ్యలో వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది.

