- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: ఇకపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించనున్న ప్రభుత్వం
Andhra Pradesh: ఇకపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించనున్న ప్రభుత్వం
Andhra Pradesh: సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

డిజిటల్ ప్రచారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు చేరే విధానం కూడా మారుతోంది. గతంలో టీవీ, పత్రికలు, రేడియో వంటి సంప్రదాయ మాధ్యమాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి భారీగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రభుత్వ సమాచారం చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా ఈ ప్రచార వ్యవస్థలో భాగం చేయనుంది.
ఈ అవకాశం ఎవరికంటే.?
కొత్త పాలసీ ప్రకారం సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రచారంలో అవకాశం లభించదు. ఇన్‌ఫ్లుయెన్సర్ల విశ్వసనీయత, వారి సోషల్ మీడియా అకౌంట్‌కు ఉన్న రీచ్, కంటెంట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. ఇందుకోసం అర్హత ప్రమాణాలను నిర్ణయించి, ఎంపికైన వారికి ధ్రువీకరణ లేదా గుర్తింపు కల్పించే ప్రక్రియను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం ఫాలోవర్ల సంఖ్యనే కాకుండా ఆయా అకౌంట్ల క్వాలిటీ, ప్రజల్లో ఉన్న ప్రభావం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారం నిజమైన ఆడియన్స్‌కు చేరేలా వ్యవస్థను రూపొందించాలన్నది పాలసీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఫాలోవర్ల ఆధారంగా కేటగిరీలు.. రూ.15 వేల వరకు చెల్లింపు
ఇన్‌ఫ్లుయెన్సర్లను వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా పలు కేటగిరీలుగా విభజించే విధానం ఈ పాలసీలో కీలకంగా ఉంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు గరిష్ఠంగా రూ.15 వేల వరకు చెల్లించే అవకాశం ఉంది. 50 వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 వరకు, 25 వేల నుంచి 49,999 ఫాలోవర్లు ఉన్నవారికి రూ.5 వేల వరకు చెల్లించనున్నారు. 10 వేల నుంచి 24,999 ఫాలోవర్లు ఉన్న కేటగిరీకి రూ.2,500 వరకు చెల్లించేలా ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాలను మరింత మందికి చేరవేయడమే లక్ష్యం
ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇప్పటికే నిర్దిష్ట ప్రాంతం లేదా వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంటే.. ప్రభుత్వ సందేశాలను ఆ ఆడియన్స్‌కు సులభంగా చేరవేయవచ్చు. అయితే ఇలాంటి ప్రచారంలో సమాచారం స్పష్టంగా, వాస్తవాధారంగా ఉండటం కూడా కీలకం. కేంద్ర ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించిన మార్గదర్శకాల్లో చెల్లింపు లేదా స్పాన్సర్డ్ కంటెంట్‌ను స్పష్టంగా వెల్లడించాలని సూచించింది.
మొత్తంగా చూస్తే.. ఏపీ ప్రభుత్వం సంప్రదాయ ప్రచార మార్గాలతో పాటు సోషల్ మీడియాను కూడా ప్రభుత్వ కమ్యూనికేషన్‌లో ముఖ్యమైన ప్లాట్ ఫామ్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక గుర్తింపు, ఫాలోవర్ల ఆధారంగా కేటగిరీలు, వాటికి అనుగుణంగా చెల్లింపులు ఈ పాలసీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపికకు తుది అర్హతలు, ధ్రువీకరణ విధానం, కంటెంట్ ప్రమాణాలు, చెల్లింపుల ప్రక్రియ వంటి పూర్తి వివరాలు అధికారిక మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.

