- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
IMD Rain Alert , IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో తెలంగాణ చలి కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో వెదర్ ఎలా ఉండనుందంటే…

ఈ రెండ్రోజులు వర్షాలే..
IMD Rain Alert : చలికాలంలో వర్షాలు... ఇదీ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి. బంగాళాఖాతంలో మళ్లీ వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారాయి... దీంతో శీతాకాలంలో వర్షాకాలం పరిస్థితులు కనిపిస్తున్నారు. అసలే చలి... ఆపైన వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో రెండుమూడు రోజులు ఇలాగే వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది.
దక్షిణాది ప్రజలకు గుడ్ న్యూస్
ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి, అటు తమిళనాడులో పొంగల్ ఘనంగా జరుపుకుంటారు... ఈ పండక్కి ముందు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు కంగారుపడుతున్నాయి. వీరికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఇది క్రమక్రమంగా బలహీనపడుతోందని... పండగనాటికి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయని తెలిపింది.
తీవ్ర వాయుగుండం తీరందాటేది ఇక్కడే
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని... ఇది శ్రీలంక వైపు దూసుకెళుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇవాళ(శనివారం, జనవరి 10) మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై పెద్దగా ఉండదని... కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ మూడు జిల్లాల్లో వర్షాలు
తీవ్ర వాయుగుండం శ్రీలంకలో తీరందాటినా ఈ శని, ఆదివారాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలుంటాయని APSDMA తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ప్రాంతాల్లో వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావం తమిళనాడు సరిహద్దు ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తుందని... సూళ్లూరుపేట, సత్యవేడు, నగరి ప్రాంతాల్లో వర్షాలుంటాయని ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇక తిరుపతి, తిరుమలలో కూడా వర్షాలు కురుస్తాయట... కాబట్టి ఈ రెండుమూడు రోజుల్లో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలి. చలి, వర్షం నుండి రక్షణ పొందేందుకు ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలి... ఈ వాతావరణ పరిస్థితులు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలుంటాయి.
తెలంగాణోళ్లూ... ఈ రెండ్రోజులు జాగ్రత్త..!
ఇదిలా ఉంటే తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం లేదు.. కానీ చలిగాలుల తీవ్రత మరింత పెరిగింది. ఇవాళ (శనివారం) ఉదయం కొన్నిజిల్లాల్లో చలి పీక్స్ కు చేరింది... ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. మరో 36 గంటలు (జనవరి 10, 11) కూడా చలి ఎక్కువగానే ఉంటుందని... ఆ తర్వాత తగ్గే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
తెలంగాణపై చలి పంజా..
తెలంగాణలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోందని... రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ రెండ్రోజులు 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది... మిగతా జిల్లాల్లో 10 డిగ్రీలకు పైనే టెంపరేచర్స్ నమోదవుతాయట. జనవరి 12 నుండి తెలంగాణవ్యాప్తంగా చలి తగ్గుతుందని... 15 డిగ్రీలకు పైనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
నేడు హైదరాబాాద్ వాతావరణం
హైదరాబాద్ వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే... ఇవాళ(శనివారం) ఆకాశం పాక్షికంగా మేఘాలతో కప్పేసి ఉంటుందని తెలిపింది. రాత్రి లేదా ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని... శివారుప్రాంతాలతో పాటు నగరంలోనూ చలి ఇరగదీస్తుందని తెలిపింది. కనిష్ఠంగా 13 డిగ్రీలు, గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

