- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలితీవ్రత తగ్గినా వర్షాల కారణంగా ఇబ్బందులు తప్పేలా లేవు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పటికే తీరం దాటింది... అయినా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంలేదు. వాయుగుండం తుపానుగా మారి భారత తీరం వైపు వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు... అలా జరిగితే భారీ వర్షాలు కురిసేవి. కానీ వాయుగుండం బలహీనపడి దిశ మార్చుకుంది.. శ్రీలంక వైపు కదిలి తీరం దాటింది. దీంతో దక్షిణ భారతదేశానికి అతిభారీ వర్షాల ముప్పు తప్పింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు, తమిళనాడులో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో ఇవాళ సోమవారం(జనవరి 12) చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది.
ఇక తీరం వెంబడి బలమైన గాలులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో చల్లటి గాలులు వీస్తూ, ఆకాశం మేఘావృతమై ఉంటుందని... అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. శ్రీహరికోట నుండి ఇచ్చాపురం వరకు తీరప్రాంతం అంతా మేఘావృతమై ఉంటుందని తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రాలో జనవరి 12,13 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో చలిగాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి. మరికొన్నిచోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి... ఆ చలికి వానలు తోడై ప్రజల ఆరోగ్యంపై ప్రభావంచూపే అవకాశాలున్నాయి. కాబట్టి వానలు పడే సమయంలో ప్రజలు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తమిళనాడులో జోరువానలు
ఈ రెండుమూడు రోజులు తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, కడలూర్, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో చలి తగ్గుతుందా..?
తెలంగాణలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది... రాబోయే రెండుమూడు రోజుల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఇవాళ్టి(జనవరి 12) నుండి ఏ జిల్లాలోనూ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు లేవని ప్రకటించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుండి 20 డిగ్రీలలోపు నమోదవుతాయట. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, నిర్మల్,నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీలు... మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

