- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ నాలుగు జిల్లాల్లో అల్లకల్లోలమే
IMD Rain Alert : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ నాలుగు జిల్లాల్లో అల్లకల్లోలమే
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గింది. కానీ ఇదే సమయంలో కొన్నిచోట్ల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది… ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం..
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రస్తుతం చలిగాలులు తగ్గాయి.. దీంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. డిసెంబర్ నెలంతా చలికి గజగజా వణికిపోయినవారు కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా చలిగాలులు తగ్గుతున్నాయని... ఇదే సమయంలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది.
ఈ నాలుగు జిల్లాల్లో వర్షాలు...
తెలంగాణకు వర్షసూచనలు లేవుగానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండుమూడు రోజులు వర్షాలుంటాయట... ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై ఉంటుందని... తిరుపతి, నెల్లూరు,చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇవాళ (1 జనవరి 2026, గురువారం) సాయంత్రం నుండి రేపు (2 జనవరి 2026, శుక్రవారం) సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశాలుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం...
ప్రస్తుతం బంగాళాఖాతం నుండి తేమతో కూడిన తూర్పు గాలులు వీస్తున్నాయని... అలాగే ఉపరితల ఆవర్తనం, పశ్చిమ విక్షోభం ప్రభావం కూడా ఆంధ్ర ప్రదేశ్ పై ఉంటుందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో (జనవరి 1 నుండి జనవరి 4 ఉదయం వరకు) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. అంటే చలి తీవ్రత చాలా తక్కువగా ఉంటుందన్నమాట.
అరకులో ఆహ్లాదరక వాతావరణం
ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో ప్రస్తుతం ఆహ్లాదకర వాతావరణం ఉంది. ముఖ్యంగా అరకు లోయలోని వంజంగి, చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గిందని…ఈ వారాంతంలో ఉదయం వేళల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. దట్టమైన పొగమంచుతో జీరో విజిబిలిటీ (కనిపించని పరిస్థితి) ఏర్పడవచ్చని తెలిపారు. అరకు అందాలను చూసేందుకు పర్యాటకులకు ఇది సరైన సమయం... అందుకే వీకెండ్ లో పోటెత్తుతున్నారని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
వైజాగ్ వెదర్
ఇక విశాఖపట్నంలో రాబోయే 3 రోజులు పగటిపూట వేడి, ఉక్కపోతగా ఉంటుంది... రాత్రి సమయంలో మేఘాలతో కూడిన ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇలా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఒక్కో చోట వాతావరణం ఒక్కోరకంగా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణ వాతావరణం...
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే తెలంగాణలో చలి తగ్గింది... అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ రెండుమూడు రోజులు (జనవరి 3 వరకు) ఇదే పరిస్థితి ఉంటుందని... చలి ప్రభావం తక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 31 రాత్రి నుండి జనవరి 1 ఉదయం వరకు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయని... ఆదిలాబాద్ లో అత్యల్పంగా 11.7 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. హైదరాబాద్ లో కూడా 13 డిగ్రీల కంటే ఎక్కువగానే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

