- Home
- Telangana
- Success Story : పంక్చర్లు వేసే తండ్రి, కూలీ తల్లి.. ఈ పేదింటి ఆడబిడ్డకు పెద్దకొలువు .. విజయదశమి రోజు విజయగాధ
Success Story : పంక్చర్లు వేసే తండ్రి, కూలీ తల్లి.. ఈ పేదింటి ఆడబిడ్డకు పెద్దకొలువు .. విజయదశమి రోజు విజయగాధ
Success Story : ఓ మారుమూల గ్రామంలో పంక్చర్లు వేసుకునే వ్యక్తి కూతురు డిఎస్పి ఉద్యోగాన్ని సాధించింది. ఈ పేదింటి ఆడబిడ్డ సక్సెస్ స్టోరీని ఈ విజయదశమి రోజు తెలుసుకుందాం.

పేదింటి బిడ్డకు పెద్దకొలువు
Success Story : కృషి వుంటే మనుషులు రుషులవుతారు... పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు... ఇలాంటి మోటివేషన్ మాటలు ఆమెకు సరిగ్గా సరిపోతాయి. మనిషికే పేదరికం, వాళ్ళు కనే కలలకు కాదు... పేదరికాన్ని జయించిమరీ కన్న కలలను సాకారం చేసుకోవచ్చని ఆమె నిరూపించింది. ఓ సాధారణ పంక్చర్లు వేసుకునే వ్యక్తి కూతురు... దినసరి కూలీ కూతురు సొంతరాష్ట్రంలో డిఎస్పీగా ఉద్యోగం సాధించి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచింది. ఈ విజయదశమి పర్వదినాన పేదింట్లో విరిసిన విద్యాకుసుమం, తెలంగాణ గ్రూప్1 ర్యాంకర్ మౌనిక విజయగాధ గురించి తెలుసుకుందాం.
పంక్చర్లు వేసే వ్యక్తి కూతురు డిఎస్పి
ఆడపిల్ల పుట్టిందని బాధపడే చాలామంది పేరెంట్స్ ని ఈ సమాజంలో చూస్తుంటాం. బాగా చదువుకున్నవారు కూడా అమ్మాయిలు వద్దు.. అబ్బాయి పుడితే బాగుంటుందని కోరుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సమాజంలో ఓ నిరుపేద దంపతులు తమకు పుట్టిన ఆడపిల్లను అదృష్ట దేవతగా భావించారు... ఆమెను చదువుల తల్లి సరస్వతి దేవిలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ ఆడబిడ్డే ఆ తల్లిదండ్రులే కాదు ఆ గ్రామస్తులంతా గర్వించే స్ధాయికి చేరుకుంది. ఆమె తెలంగాణ అమ్మాయి మౌనిక.
ఇదికదా సక్సెస్ అంటే...
ములుగు జిల్లాలోని జేడీ మల్లంపల్లికి చెందిన సమ్మయ్య-సరోజ దంపతుల కూతురు మౌనిక కష్టాలను చూస్తూనే పెరిగింది. తండ్రి సమ్మయ్య గ్రామంలో వాహనాలకు పంక్చర్లు వేసేవాడు... తల్లి కూలీపనులకు వెళ్లేది. ఇలా తల్లిదండ్రులిద్దరు కష్టపడినా చాలిచాలని ఆదాయం వచ్చేది... వారి కష్టాలను చిన్నప్పటినుండి చూస్తూవచ్చింది మౌనిక. అందుకే కుటుంబపోషణ కోసం ఇంతలా కష్టపడుతున్న పేరెంట్స్ ను పెద్దయ్యాక సుఖంగా చూసుకోవాలని భావించింది. అందుకే చిన్నప్పటినుండి బాగా చదువుకునేది... ఏమాత్రం నిర్లక్ష్యం చేసేదికాదు.
పెద్దగా ఖర్చులేకుండానే ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసింది మౌనిక. ఇలా 2020 లో ఆమె డిగ్రీ పూర్తిచేసి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించిన మౌనికకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి... అన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. పంక్చర్లు వేసుకునే వ్యక్తి కూతురు ఇప్పుడు పోలీస్ శాఖలో అత్యున్నత ఉద్యోగి డిఎస్పిని మారారు.
కోచింగ్ లేకుండానే గ్రూప్1 ర్యాంక్
మౌనిక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి గురించి తెలుసుకాబట్టి పెద్దగా ఖర్చు లేకుండానే ప్రిపరేషన్ సాగించింది. కోచింగ్ లేకుండా గ్రూప్ 1 సాధించడం కష్టమని చాలామంది ఆమెతో చెప్పారు... కానీ అందుకు బాగా డబ్బులు అవసరం కాబట్టి వెనక్కితగ్గారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే సొంతంగా ప్రిపరేషన్ కొనసాగించారు మౌనిక.
ఎంతో కష్టపడి చదివిన ఆమె ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఇటీవల వెలువడిన గ్రూప్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 315 ర్యాంకు సాధించారు మౌనిక. ఇలా పోలీస్ శాఖలో డిఎస్పిగా ఉద్యోగాన్ని సాధించి ఆ నిరుపేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని నింపింది. ఇలా మొత్తం ములుగు జిల్లా ప్రజలంతా గర్వపడేలా చేసింది... పేదింది బిడ్డ పెద్దకొలువు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు DSP మౌనిక.
తెలంగాణ గ్రూప్ 1 వివాదం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్1 పోటీ పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 2004 ఫిబ్రవరిలో మొత్తం 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది... ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఇటీవలే ఫలితాలను కూడా విడుదల చేసింది. అయితే కొందరు అభ్యర్థులు గ్రూప్1 పరీక్షల నిర్వహణ, ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు... దీంతో గందరగోళం నెలకొంది. వివిధ పరిణామాల తర్వాత కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. దీంతో మౌనిక లాంటి అభ్యర్ధులు ఉన్నత ఉద్యోగాలను సాధించి కల నెరవేర్చుకున్నారు.