- Home
- Andhra Pradesh
- SEC Anil Chandra Punetha: 23 మున్సిపాలిటీలు, 13వేల గ్రామపంచాయతీల ఎన్నికలపై త్వరలో నిర్ణయం
SEC Anil Chandra Punetha: 23 మున్సిపాలిటీలు, 13వేల గ్రామపంచాయతీల ఎన్నికలపై త్వరలో నిర్ణయం
SEC Anil Chandra Punetha: ఏపీలో దాదాపు 13వేల పంచాయతీలు, పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీల ఎన్నికలపై త్వరలో నిర్ణయం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు.

మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి
SEC Anil Chandra Punetha: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీల ఎన్నికలతో పాటు దాదాపు 13వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో త్వరలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని, ఫిరంగిపురం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను తనిఖీ చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడి లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఫుటేజీలు, వీడియో రికార్డులు 60 రోజుల పాటు భద్రం
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినట్లు వివరించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డులను 60 రోజుల పాటు భద్రపరుస్తామని తెలిపారు. స్థానికంగా తలెత్తిన సమస్యలపై పల్నాడు జిల్లా కంకణాలపల్లి గ్రామస్థులు అందించిన వినతులపై స్పందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మధ్యాహ్నం 4 గంటలలోగా పూర్తి...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మధ్యాహ్నం 4 గంటలలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, మొత్తం ప్రక్రియ సాయంత్రంలోగా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. కాగా, గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషనర్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకోబోయే తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.













