Weather Update : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ
ఇప్పటికే అర్నబ్, మురసు తుపానులు బీభత్సం సృష్టించాయి… ఆంధ్ర ప్రదేశ్ లో అయితే భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి, తెలంగాణలోనూ వర్షాలు పడ్డాయి. అయితే మరో మూన్నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఇప్పటికే తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటంతో నగరంలో చలి తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు వాతావరణ నిపుణులు.
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నవంబర్ 12 తర్వాత మరో అల్పపీడనం?
బంగాళాఖాతంలో వరుసగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 12 తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా నవంబర్ 15 తర్వాత ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
అయితే తుపాను ఏర్పడటం, దాని తీవ్రత, దిశ, తీరం దాటే ప్రాంతం వంటి అంశాలపై ఇప్పుడే స్పష్టత లేదు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే ఈ వ్యవస్థల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో వర్ష సూచన
తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్లో చలి పెరిగే అవకాశం
రాజధాని హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చల్లని వాతావరణం ఉండే అవకాశం ఉంది. దీంతో నగరవాసులు చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వాతావరణం మరింత మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.













