ఒకేసారి రెండు అల్పపీడనాలు.. సముద్రంలో అల్లకల్లోలం, మరో తుపాను ఖాయం
Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరో తుఫాన్ భయపెడుతోంది. సముద్రంలో జరుగుతోన్న మార్పుల కారణంగా వాతావరణంలో భారీ మార్పులు జరిగే అవకావశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మలక్కా జలసంధి వద్ద తీవ్ర అల్పపీడనం
మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని సంస్థ తెలిపింది. రాబోయే 6 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఈ వాయుగుండం మరింత బలపడితే, వచ్చే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మరో అల్పపీడనం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం.. శ్రీలంక ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కూడా రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఈ రెండు ఒకేసారి బలపడటం వల్ల తీర ప్రాంతాల్లో గాలులు, అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
మత్స్యకారులకు కఠిన హెచ్చరిక
గురువారం నుంచి సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అలలు 2–4 మీటర్ల ఎత్తులో ఉప్పెనలా రావచ్చని అంచనా వేస్తున్నారు.
రానున్న రోజుల్లో వర్షాలు
శనివారం నుంచి మంగళవారం వరకు అంటే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరీముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నెల్లూరు, ఓంగోలు ప్రాంతాల్లో భారీ గాలులు 40–60 km/h వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రైతులకు ముఖ్య సూచనలు
రాబోయే రోజుల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది. పంట కోతలు ముందుగానే పూర్తి చేయాలని, ధాన్యం, పంటల్ని తడవకుండా సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. ఎరువులు, పురుగు మందులు తడవకుండా నిల్వ చేసుకోవాలని చెబుతున్నారు.

