ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోపడి 15మంది దుర్మరణం చెందిన దుర్ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ఉన్నట్లు సమాచారం. 

Andhra Pradesh Road Accident : ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు... ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం

చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భద్రాచలం ఆలయాన్ని సందర్శించి అన్నవరం వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. చింతూరు నుండి మరేడుమిల్లి ఘాట్ రోడ్డులో వెళుతుండగా బస్సు అదుపుతప్పి లోయలోపడింది. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడినవారిని లోయలోంచి బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. అయితే వీరిలో చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు... వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కొందరు ఘటనాస్థలిలోనే మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.