- Home
- Andhra Pradesh
- Rain Alert : వాయుగుండంతో బంగాళాఖాతంలో అల్లకల్లోలం .. శనివారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Rain Alert : వాయుగుండంతో బంగాళాఖాతంలో అల్లకల్లోలం .. శనివారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడి అదికాస్త వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. వీటి ప్రభావంతో మరోసారి తెలుగురాష్ట్రాల్లో కుండపోత వానలు తప్పవా?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Rain Alert : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆగస్ట్ లో అత్యంత భారీ వర్షాలు కురవగా సెప్టెంబర్ కూడా ఇలాగే సాగుతోంది. వాతావరణ పరిస్ధితులు అనుకూలంగా ఉండటంతో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు ఒక్కసారిగా ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని వర్షాన్ని కుమ్మరిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఇలా భారీ వర్షాలు, వరద పరిస్థితులతో సతమతం అవుతున్న తెలుగు ప్రజలకు మరో షాక్ ఇచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాబోయేరోజుల్లో బంగాళాఖాతంతో మరో అల్పపీడనం ఏర్పడనుందని... అది వాయుగుండంగా బలపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.
అల్పపీడనం బలపడి వాయుగుండం
ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 27నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఇది అదే రోజు ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి రాష్ట్రప్రజలు మరీముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని... వ్యవసాయ పనుల్లో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి
ప్రస్తుతానికి ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
తెలంగాణలో నేడు వర్షాలు కురిసే జిల్లాలివే
తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా శనివారం (సెప్టెంబర్ 20) యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భరీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇక మహబూబ్ నగర్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మెదక్, ఆదిలాబాద్, ఆసాఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితి ఏంటి?
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డిలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం వాతావరణం పొడిగానే ఉండి ఆకాశం నిర్మలంగా ఉంటుందని... సాయంత్రం వర్షాలు మొదలవుతాయని... ఇది మెల్లిగా బలపడి అర్థరాత్రికి భారీ వర్షాలుగా మారతాయని హచ్చరించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD ప్రకటించింది.