- Home
- Andhra Pradesh
- ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వర్షం, మరోవైపు చలి. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం
ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వర్షం, మరోవైపు చలి. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం
IMD Rain Alert: శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించిన దిత్వా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావంతో చలి తీవ్రత కూడా పెరగనుంది.

దూసుకొస్తున్న దిత్వా తుపాను
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దిత్వా తుపాను నెమ్మదిగా దూసుకొస్తుంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 4 కిమీ వేగంతో కదిలిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరి నుంచి సుమారు 420 కిమీ, చెన్నై నుంచి 520 కిమీ దూరంలో ఉందని వివరించింది. తీర ప్రాంతాలకు చేరువవుతూ ఉండటంతో కోస్తా ప్రాంతాల్లో బలమైన గాలులు, అలల ఎత్తు పెరిగే సూచనలు ఉన్నాయి. తుపాను మార్గాన్ని నిరంతరం గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో చలితో పాటు వర్షాలు
దిత్వా ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం పుదుచ్చేరి తీరానికి తుపాను చేరే అవకాశం ఉండటంతో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తుయాని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, కడప, శ్రీసత్యసాయి ప్రాంతాల్లో కూడా ప్రభావం కనిపించవచ్చు. అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచాలని విపత్తు నిర్వహణ శాఖ జిల్లాల యంత్రాంగాలకు సూచించింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయంటే
ఉత్తర, మధ్య తెలంగాణలో చలి ఒక్కసారిగా పెరిగింది. 28 నుంచి 30వ తేదీ వరకు పలు జిల్లాల్లో గాలులు వేగంగా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9°C వరకు పడిపోవచ్చని అంచనా. హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజులు 11–14°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దిత్వా తుపాను మార్గాన్నిబట్టి డిసెంబర్ 2–5 మధ్య దక్షిణ, తూర్పు జిల్లాల్లో జల్లులు పడవచ్చు. శని, ఆది రోజుల్లో నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏ జిల్లాల్లో వర్షాలు?
తేలికపాటి–మోస్తరు వర్షాలు:
ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్.
తేలికపాటి జల్లులు:
వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి.
మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రైతులు పంటలు రక్షించుకునే చర్యలు చేపట్టాలని, ప్రజలు చలి–వర్షాల పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
శ్రీలంకలో బీభత్సం
శ్రీలంక తూర్పు–ఉత్తర ప్రాంతాల్లో దిత్వా భయంకర వర్షాలు కురిపిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ట్రింకోమాలి వద్ద 40 కిమీ, బట్టికాలోవా వద్ద 140 కిమీ దూరంలో ఉంది. భారత్ వైపు కదులుతూ కరైకల్‌కు 270 కిమీ, పుదుచ్చేరికి 380 కిమీ, చెన్నైకి 490 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రి తర్వాత లేదా ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్ర దక్షిణ తీరం దగ్గరకు చేరే అవకాశం కనిపిస్తుంది. ఆదివారం రాత్రి వరకు తుపానుగా కొనసాగి, తర్వాత తీవ్రమైన వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. చెన్నై దక్షిణ తీరాన్ని ఆనుకుని సముద్రంలోనే బలహీనపడే అవకాశం కూడా ఉంది.

