- Home
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మారడం ఖాయం.. రూ. 50 వేల కోట్లతో భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మారడం ఖాయం.. రూ. 50 వేల కోట్లతో భారీ పెట్టుబడి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది రాష్ట్రం. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్
ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. సుమారు రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతి పెద్ద కేంద్రం ఇదే కావడం విశేషం. ఇన్వెస్ట్ ఇండియా ఈ ప్రతిపాదనను “దేశానికి గేమ్ ఛేంజర్” అని అభివర్ణించింది.
KNOW
డిజిటల్ ఎకోసిస్టమ్ బలోపేతం
ఈ డేటా సెంటర్ ద్వారా గూగుల్ క్లౌడ్, యూట్యూబ్, సెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు మరింత శక్తివంతమవుతాయి. దేశీయ పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సేవలకు అనుగుణంగా అధునాతన AI సొల్యూషన్లు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల భారతదేశం ప్రపంచ డిజిటల్ మార్కెట్లో మరింత బలంగా నిలుస్తుంది.
డేటా భద్రత
విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుతో భారతీయ వినియోగదారుల డేటా దేశంలోనే నిల్వ అవుతుంది. దీంతో డేటా చౌర్యం లేదా విదేశాలకు డేటా లీక్ అవుతుందన్న భయం ఉండదు. అదనంగా, మూడు సబ్‌మెరైన్ కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచనున్నారు. ముంబయిలో ఇప్పటికే గూగుల్ సర్వర్లు ఉన్నందున, సముద్రం ద్వారా డార్క్ ఫైబర్ కనెక్టివిటీ తక్కువ ఖర్చుతో సాధ్యం కానుంది.
పెరగనున్న ఉపాధి అవకాశాలు
ఒక్కో వ్యక్తికి ఐటీ రంగంలో ఉద్యోగం కల్పించడానికి సగటున రూ. 2 కోట్ల పెట్టుబడి అవసరమని నిపుణుల లెక్క. ఆ లెక్కన గూగుల్ పెట్టబోయే పెట్టుబడితో దశలవారీగా 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరో 50,000 మందికి ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉంది. ఇది విశాఖలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ మార్కెట్‌ను బలోపేతం చేస్తుంది.
పునరుత్పాదక విద్యుత్‌తో డేటా సెంటర్
డేటా సెంటర్ కూలింగ్, నిర్వహణ కోసం భారీ స్థాయిలో విద్యుత్ అవసరం అవుతుంది. దీని కోసం గూగుల్ రూ. 20 వేల కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా సముద్రపు అలల ద్వారా చిన్న హైడ్రో ప్రాజెక్టులు నిర్మించి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించనుంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో గూగుల్ సముద్రతీర ప్రాంతాన్నే డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంపిక చేసుకుంది.