- Home
- Andhra Pradesh
- Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉచితంగా పెళ్లిళ్లు... మీరు కూడా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉచితంగా పెళ్లిళ్లు... మీరు కూడా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
తెలుగు యువతీయువకులకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండానే తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిళ్లు చేయిస్తున్నారు. మీరు కూడా ఇలా పెళ్లిచేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Tirumala
Tirumala : తిరుమల ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యమే ఈ జీవితానికి చాలనుకునే భక్తులు చాలామంది ఉంటారు. అలాంటిది ఆ స్వామివారి సన్నిధిలోనే జీవిత భాగస్వామిని పెళ్ళాడే అవకాశం వస్తే.. అదీ టిటిడి ఆధ్వర్యంలో పెద్దగా ఖర్చు లేకుండానే జరిగితే.. ఆ జంట అదృష్టవంతులే. ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అనుకునేందుకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? టిటిడి అందించే సేవలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.
Tirumala
తిరుమలలో పెళ్లికి ఎవరు అర్హులు :
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆర్థికంగా వెనకబడిన పేద హిందువులకు ఉచితంగా వివాహాలు చేస్తోంది. గత తొమ్మిది పదేళ్లుగా తిరుమలలోని కల్యాణ వేదికలో ఈ పెళ్లిళ్లు నిర్వహిస్తోంది. అయితే ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లికి కేవలం పేదవారికే అవకాశం కల్పిస్తున్నారు.
వధూవరులు చట్టబద్దంగా పెళ్ళి చేసుకునే వయసు కలిగివుండాలి. అంటే అమ్మాయి 18 ఏళ్లు, అబ్బాయి 21 ఏళ్లు పైబడి వయసు కలిగివుండాలి. ప్రేమ వివాహాలు, రెండో పెళ్లిళ్లు చేసుకునేవారికి తిరుమలలో అవకాశం ఉండదు. అందుకే వధూవరుల తల్లిదండ్రులు తప్పకుండా పెళ్లికి హాజరుకావాల్సి ఉంటుంది... లేదంటే వాళ్లు ఎందుకు రాలేదో సరైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆర్థిక స్తోమత సరిగ్గా లేని జంటలకే తిరుమలో పెళ్లికి అవకాశం ఇస్తారు. ఇలా ఇప్పటివరకు వేలాది జంటలు తిరుమలలో పెళ్లిపీటలెక్కారు. అందరిలా ఆడంబరంగా పెళ్లి చేసుకోలేకపోయినా శ్రీవారి సన్నిధిలో ఒక్కటయ్యామనే సంతృప్తి ఆ జంటలకు ఉంటుంది.
Tirumala
తిరుమలలో పెళ్లికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
తిరుమలలో ఉచిత వివాహం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం టిటిడి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. ఇందులో అబ్బాయి, అమ్మాయి తో పాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి. అందరి ఆధార్ కార్డులను అప్ లోడ్ చేయాలి. అలాగే వధూవరులు జనన, వయసు ధృవీకరణ పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఇలా అన్ని పత్రాలను సమర్పించి వివాహ తేదీ, సమయాన్ని కూడా తెలియజేయాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదు వస్తుంది.
ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న రసీదు తీసుకుని వధూవరులు, తల్లిదండ్రులు వివాహ తేదీరోజు తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి సమయంకంటే కాస్త ముందుగానే పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికకు చేరుకోవాలి... అక్కడ సిబ్బంది రసీదును పరిశీలించి వివాహానికి అనుమతిస్తారు.
Tirumala
పెళ్ళితో పాటు శ్రీవారి దర్శనం ఫ్రీ :
తిరుమలలో వివాహం చేసుకునే వధూవరులకు టిటిడి కొన్న ఉచిత సేవలను అందిస్తుంది. వివాహ సమయంలో అర్చకులు, మంగళవాద్యాలు, పసుపు కుంకుమ, కంకణం వంటి కొన్ని వస్తువులను ఉచితంగానే అందిస్తారు. మరికొన్నివివాహ సామాగ్రిని పెళ్ళిచేసుకునేవారు తీసుకురావాల్సి ఉంటుంది.
వివాహం చేసి నూతర వధూవరులను అర్చకులు ఆశీర్వచనం అందిస్తారు. అంతేకాదు నూతన వధూవరులు, వారి తల్లిదండ్రులకు రూ.300 ప్రత్యేక దర్శన మార్గంలో ఉచిత దర్శనానికి అనుమతిస్తారు. అలాగే వారికి ఆరు లడ్డూలు ఉచితంగా అందిస్తారు. ఇలా పేద జంటలకు ఎలాంటి ఖర్చు లేకుండానే పెళ్లి, శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం అందించి ఆనందంగా ఇంటికి వెళ్లేలా చూస్తుంది టిటిడి.
Tirumala
తిరుమలలో ఇప్పటివరకు 26 వేల పెళ్లిళ్లు :
టిటిడి తిరుమలలో నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు మంచి స్పందనే ఉంది. 2016 ఏప్రిల్ 25 న తిరుమలలో పేద జంటలకు వివాహాలు చేయడం ప్రారంభమయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు అంటే మే 1, 2025 వరకు 26,214 మంది వివాహాలు జరిగినట్లు టిటిడి చెబుతోంది.
ఈసారి కూడా చాలామంది ఇప్పటికే వివాహం చేసుకోగా మరికొన్ని జంటలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. శ్రీవారి సన్నిధిలో పెళ్ళి చేసుకోవాలన్న పేదల కలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఇలా నెరవేరుస్తోంది.