తుపాను ముప్పు తప్పింది.. ఇప్పుడు ఈ తెలుగు జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ గండం
Flash Floods : మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న అతిభారీ వర్షాలు ప్రమాదాలకు కారణం కావచ్చని… తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచివుందని IMD హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్
IMD Rain Alert : మొంథా తుపాను ముప్పు తప్పింది.. ఇప్పటికే తీరందాటిన ఈ తుపాను బలహీనపడుతోంది. అయితే ఈ తుపాను కారణంగా కురిసే వర్షాలతో ఇంకా ప్రమాదం పొంచివుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. మొంథా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ (హఠాత్తుగా వరదలు) వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. కాబట్టి తెలుగు ప్రజలు తుపాను తీవ్రత తగ్గినా ఈరోజు(అక్టోబర్ 29, బుధవారం) అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
ఫ్లాష్ ఫ్లడ్స్ కు కారణమిదే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రోజురోజుకు మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. అయితే అల్పపీడనం, వాయుగుండంగా ఉన్నప్పుడు పెద్దగా ప్రభావం చూపించలేదు... కానీ తుపాను, తీవ్రతుపానుగా మారాక ఏపీలోనే కాదు తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి. ఇక మొంథా తీరందాటాక వర్షాల తీవ్రత మరింత పెరిగింది. కొద్దిగంటల్లోనే 30 మిమీ వర్షపాతం... గత 24 గంటల్లో 196 మిమీ వర్షపాతం నమోదయ్యిందని IMD తెలిపింది. దీంతో వర్షపునీరు మెళ్లిగా నదులు, వాగులు వంకలు, జలాశయాలు, చెరువుల్లోకి చేరుతోంది... దీంతో ప్రవాహ ఉద్ధృతి పెరిగి కొన్నిచోట్ల... పూర్తిగా నిండిపోయి నీరు ఉప్పొంగడంతో మరికొన్నిచోట్ల వరదనీరు జనావాసాలను ముంచెత్తే అవకాశాలుంటాయి. ఇలా నీటిప్రవాహాల పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలు సంభవించే అవకాశాలున్నాయని IMD హెచ్చరిస్తోంది.
ఈ తెలుగు జిల్లాల్లో ప్లాష్ ప్లడ్స్ ప్రమాదం
బుధవారం ఉదయంనుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలు... ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఫ్లాష్ ప్లడ్స్ ప్రమాదం పొంచివుందని IMD హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వరదముప్పు పొంచివుందట... అలాగే యానాంలో కూడా సడన్ వరదలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, పెద్దపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచివుందని IMD హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా నదీ తీరప్రాంతాలు, వాగులు వంకలు, చెరువులు, ఇతర నీటి ప్రవాహాల సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు వరదల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని IMD తెలిపింది. బ్రిడ్జిలపైనుండి నీరు ప్రవహించడం, రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది... కొన్ని ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తోంది. రాబోయే ఆరేడు గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో... రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మహారాష్ట్రలోనూ ఫ్లాష్ ఫ్లడ్స్
మొంథా తుపాను ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రాలపైనే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. మహారాష్ట్రలో కూడా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో ఇక్కడ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశాలున్నాయని IMD హెచ్చరిస్తోంది. మరాఠ్వాడా సమీప ప్రాంతాలు నాందేడ్, హింగోలి, పర్బణీ... విదర్భా ప్రాంతాలు బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యావత్మాల్, నాగ్పూర్ జిల్లాల్లో సడన్ గా వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించండి
- వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకూడదు.
- ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదు.
- వంతెనలు, రోడ్లపై ప్రవహించే వరదనీటిని దాటే ప్రయత్నం చేయరాదు
- ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవడం మంచింది. వాగులు, చెరువుల లేకుండా ఉండే దారుల్లో ప్రయాణించండి.
- రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి.
- స్థానిక అధికారులు, అత్యవసర సిబ్బంది సూచనలు పాటించండి
- అత్యవసర పరిస్థితుల్లో మీ జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వండి.
- ఐఎండి, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు నుంచి జారీ అయ్యే తాజా సమాచారం తెలుసుకొండి… దాని ప్రకారం తగిన జాగ్రత్తలు పాటించండి.