విజయనగరంలో మొంథా తుపాను విధ్వంసం .. 30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్
Montha Cyclone : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నాయి. మొంథా తుపాను గతరాత్రి తీరందాటుతూ నానా బీభత్సం సృష్టించింది… కొన్నిచోట్ల ప్రమాదాలకు కూడా కారణమయ్యింది.

మొంథా తుపానుతో తప్పిన పెనుప్రమాదం
Cyclone Montha : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను అర్ధరాత్రి తీరం దాటింది.. దీంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు నానా బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి... ఇలా విజయనగరం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో 30 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు.
విజయనగరంలో విద్యార్థులకు విద్యుత్ షాక్
వివరాల్లోకి వెళితే... మొంథా తుపాను తీరందాటే సమయంలో విజయనగరం జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గుర్ల మండలంలోని కస్తూర్భా హాస్టల్ పక్కనగల విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి విద్యుత్ సరఫరా అయ్యే తీగలు హాస్టల్ గోడను తాకాయి. ఈ క్రమంలో హాస్టల్ గోడల్లో కరెంట్ సరఫరా జరిగి 30 విద్యార్థులు విద్యుత్ షాక్ కు గురయినట్లు తెలుస్తోంది.
విద్యార్థుల అస్వస్థత
వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కరెంట్ షాక్ కు గురయిన విద్యార్థులను అత్యవసర చికిత్సకోసం నెల్లిమర్ల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని... ఓ ఐదుగురు విద్యార్థులు మాత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు.
చెట్టు కూలి మహిళ మృతి
ఇదిలావుంటే మొంథా తుపాను ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తుపాను కారణంగా వీచిన ఈదురుగాలులకు కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామం మాకనపాలెంలో ఓ ఇంటి ఆవరణలో ఒక్కసారిగా చెట్టుకూలి గూడపల్లి వీరవేణి అనే మహిళపై పడింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది.
మొంథా తుపాను బీభత్సం
ఇలా మొంథా తుపాను కారణంగా ప్రమాదాలు అనేక ప్రమాదాలు జరిగాయి... ప్రాణనష్టమే కాదు ఆస్తినష్టం కూడా జరిగింది. ఈదురుగాలులు విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన్ టవర్లు దెబ్బతిన్నాయి... రోడ్డుపక్కన చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా దెబ్బతినడంతో సమాచార సంబంధాలు కూడా తెగిపోయాయి. ఈ గాలులతో పాటు భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు.

