అన్నింటికీ సిద్ధంగా ఉండండి.. మోంతా తుఫానుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Cyclone Montha: బంగాళాఖాంతో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

బంగాళాఖాతంలో బలపడుతున్న 'మోంతా' తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రికృతమై గంటకు సుమారు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా, తరువాత తీవ్ర తుఫానుగా (‘మోంతా’) మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కు 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నానికి 850 కి.మీ, కాకినాడకు 840 కి.మీ దూరంలో ఉంది. అక్టోబర్ 28 రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరాన్ని తుఫాను దాటే అవకాశం ఉన్నట్లు ఐఎమ్‌డీ తెలిపింది.
ప్రత్యేక అధికారుల నియామకం
తుఫాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి సహాయ, పునరావాస చర్యలను సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. ప్రాంతాల వారీగా ప్రత్యేక నియామకాలు ఈ విధంగా ఉన్నాయి:
ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం – కెవిఎన్ చక్రధర్ బాబు, విజయనగరం – పట్టన్‌షెట్టి రవి సుబాష్, మాన్యం – నారాయణ భారత్ గుప్తా, విశాఖపట్నం – అజయ్ జైన్, అనకాపల్లి – వడరేవు వినయ్ చంద్
గోదావరి ప్రాంతం: తూర్పు గోదావరి – కె.కన్న బాబు, కాకినాడ – విఆర్ కృష్ణ తేజ, కొనసీమ – విజయ రామ రాజు, పశ్చిమ గోదావరి – వి.ప్రసన్న వెంకటేశ్, ఎలూరు – కాంతిలాల్ దండే
కృష్ణా ప్రాంతం: కృష్ణా – అమ్రాపాలి, ఎన్టీఆర్ – శశి భూషణ్ కుమార్, గుంటూరు – ఆర్.పి. సిసోడియా, బాపట్ల – ఎం. వేణుగోపాల్ రెడ్డి
దక్షిణాంధ్ర: ప్రకాశం – కొనా శశిధర్, నెల్లూరు – డా. ఎన్. యువరాజ్, తిరుపతి – పి. అరుణ్ బాబు, చిత్తూరు – పి.ఎస్. గిరీష
ఈ అధికారులు జిల్లా కలెక్టర్లతో కలిసి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం, రెస్క్యూతో పాటు సహాయ చర్యలను సమన్వయం చేయడం, నష్టాల లెక్కింపు, పరిహారం పంపిణీ వంటి వాటిని చూసుకుంటారు.
విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తాజా నివేదిక విడుదల చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం,
రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీర ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గాలులు వేగంగా వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
బీచ్‌లు, పర్యాటక కార్యకలాపాలు ఇప్పటికే నిలిపివేశారు.
అదే విధంగా ప్రజలు అవసరం అయితే తప్ప అక్టోబర్ 26 నుంచి 29 వరకు ప్రయాణాలు చేయరాదని సూచించారు.
మంత్రి వంగలపూడి అనిత సమీక్ష
రాష్ట్ర హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రతి శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిరోధించాలి.” అని తెలిపారు.
ప్రజల భద్రతే ముఖ్యం
ప్రభుత్వం ఇప్పటికే తీరం వెంట సహాయ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ దళాలను మోహరించింది. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, జెనరేటర్లు, తాగునీరు, ఆహారం నిల్వలు సిద్ధం చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు, తుఫాను తీవ్రతపై నిరంతర అప్డేట్లు విడుదల చేయనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను విస్మరించాలని విజ్ఞప్తి చేసింది.