మొంథా తుపాను ఉగ్రరూపం : అతిభారీ వర్షాలు.. ఏపీలో అలర్ట్ ! ట్రైన్స్, ఫ్లైట్స్ రద్దు
Cyclone Montha Alerts: బంగాళాఖాతంలో విరుచుకుపడుతున్న మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని గంటల్లో 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. రైలు, విమాన సర్వీసులు రద్దు చేశారు.

మొంథా తుఫాన్ వేగం పెరుగుతోంది
బంగాళాఖాతంలో బలపడిన మొంథా తుపాన్ వేగంగా తీరం దిశగా ప్రయాణిస్తోంది. గడచిన 6 గంటల్లో 17 కి.మీ వేగంతో కదిలిన ఈ తుపాను కేంద్రం ప్రస్తుతం చెన్నైకి 480 కి.మీ, కాకినాడకు530 కి.మీ, విశాఖపట్నంకు 560 కి.మీ దూరంలో ఉందని అధికారులు ప్రకటించారు.
పశ్చిమ వాయవ్య దిశగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్రమైన తుపానుగా మారనుంది. కాకినాడ సమీప తీరం మీదుగా ఇది దూసుకుపోతుందని అంచనాలున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ప్రఖర్ జైన్ నేతృత్వంలో విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే అన్ని వ్యవస్థలను అలర్ట్‌లో ఉంచింది. తీర ప్రాంత ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ అయ్యాయి.
యానాంలో అలర్ట్
కాకినాడ, యానాం మధ్య తీరం దాటొచ్చని అంచనా నేపథ్యంలో యానాం యంత్రాంగం అప్రమత్తమైంది. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక అధికారి అమన్ శర్మ యానాం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై శాఖల పనితీరును వివరంగా సమీక్షించారు. 16 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల నుంచి తరలింపుకు వాహనాల సిద్ధంగా ఉంచారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు మైక్ ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన నిత్యావసర వస్తువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచనలు కూడా అందించారు.
విజయవాడకు భారీ వర్షాల హెచ్చరికలు
తుపాను ప్రభావంతో విజయవాడలో 162 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. షాపులు మూసివేయాలని సూచనలు చేశారు. మెడికల్ షాపులు, పాలు, కూరగాయల దుకాణాలకు మినహాయింపులు ఇచ్చారు. 40 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో జేసీబీలు, పంపులు సిద్ధంగా ఉంచారు.
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు 9154970454 / 0866 2424172 / 0866 2422515 / 0866 2427485 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు చేశారు.
రైలు, ఫ్లైట్ సర్వీసులపై తుపాను ప్రభావం
మొంథా తుపాను నేపథ్యంలో రవాణా వ్యవస్థపై గట్టి ప్రభావం పడుతోంది.
విమానాల రద్దు
విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానాలు అక్టోబర్ 28న రద్దు చేశారు. అందులో..
• విశాఖ–విజయవాడ
• విజయవాడ–హైదరాబాద్
• బెంగళూరు–విజయవాడ
• షార్జా–విజయవాడ
రైలు సేవలపై ప్రభావం
వందకు పైగా రైళ్లు రద్దు చేశారు.
• ఈస్ట్ కోస్ట్ రైల్వే మొదట 43
• దక్షిణ మధ్య రైల్వే అదనంగా 75+ రైళ్లు
• విజయవాడ పరిధిలో 54 రైళ్లు రద్దు చేశారు. టికెట్ మొత్తాలు రిఫండ్ చేశారు.
తీరప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు
పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే అలజడి వాతావరణం ఉందని సమాచారం. భారీ గాలులు, వర్షాలు కొనసాగుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరించారు. తాండవ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల ఉంటుందని సమాచారం. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.