దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Cyclone Ditwah: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను ఉత్తర దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

దిత్వా తుపాను: ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వైపు దిత్వా తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను రాష్ట్రంపై పెను ప్రభావం చూపనుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుపాను ఆదివారం తెల్లవారుజామునకు ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు అత్యంత సమీపంలోకి రానుంది. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం హెచ్చరించింది.
వివరాల్లోకెళ్తే.. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా దిత్వా తుపాను కొనసాగుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుకు కదులుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ప్రస్తుతానికి తుపాను కారైకల్‌కు 120 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 220 కిలోమీటర్లు, చెన్నైకి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Cyclone Ditwah: తీర ప్రాంతాల్లో తీవ్ర గాలుల హెచ్చరికలు
తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వైపు తుపాను కేంద్రీకరణ వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం (నవంబర్ 29) రాత్రికి తుపాను 60 కిలోమీటర్ల కనీస దూరంలో, ఆదివారం (నవంబర్ 30) ఉదయానికి 50 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్ల కనీస దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని వివరించింది.
తీర ప్రాంతాల వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల సంస్థ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Cyclone Ditwah: రానున్న రెండు రోజులు భారీ వర్షాలు
దిత్వా తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం వాతావరణ వివరాలు గమనిస్తే..
- ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
Cyclone Ditwah: సోమవారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
సోమవారం (డిసెంబర్ 01, 2025) రాష్ట్రంలో వర్షపాతం అంచనాలు గమనిస్తే..
- ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
తుపాను ఎఫెక్ట్ : సహాయక చర్యల కోసం బృందాల మోహరింపు
తుపాను నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అత్యవసర సహాయక చర్యల కోసం ముందస్తు ఏర్పాట్లు చేశారు. కడపలో 2 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను, వెంకటగిరిలో 3 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు.
విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, జిల్లాల్లో మండలస్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు.
ముందస్తుగానే అన్ని ప్రభుత్వ శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులని వెనక్కి రప్పించారు. రైతాంగానికి భారీ వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

