ఎకరం 151 కోట్లు : హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోనే రికార్డు రేట్
Hyderabad’s Kokapet land auction: హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్ ఈ-వేలంలో ఎకరానికి రూ.151.25 కోట్లు పలికి కొత్త రికార్డు సాధించింది. 9.06 ఎకరాలతో హెచ్‌ఎండీఏకు రూ.1352 కోట్లు ఆదాయం వచ్చింది.

కోకాపేటలో మరో సరికొత్త రికార్డు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కోకాపేట తిరుగులేని చోదకశక్తిగా కొనసాగుతోంది. తాజాగా నియోపోలిస్ లేఅవుట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన రెండో విడత ఈ-వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.151.25 కోట్లతో రికార్డుల మోత మోగించింది.
ప్లాట్ నెంబర్ 15లో ఎదురెదురుగా జరిగిన బిడ్డింగ్ యుద్ధం చివరకు లక్ష్మీనారాయణ కంపెనీకి అనుకూలంగా ముగిసింది. మరోవైపు ప్లాట్ 16లో ఎకరానికి రూ.147.75 కోట్లు పలకడం ఈ వేలానికి మరింత ప్రత్యేకతను తెచ్చింది.
మొత్తం 9.06 ఎకరాల భూమి అమ్మకం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1352 కోట్ల భారీ ఆదాయం లభించింది. ప్లాట్ 15లో 4.03 ఎకరాల భూమి రూ.609.55 కోట్లకు, ప్లాట్ 16లో 5.03 ఎకరాల భూమి రూ.743 కోట్లకు విక్రయించడం ఇందుకు కారణం.
నాలుగు రోజుల్లోనే బద్దలైన రికార్డు.. మార్కెట్‌లో కోకాపేట సత్తా
ఈ నెల 24న జరిగిన మొదటి విడత వేలంలో ఎకరానికి రూ.137.25 కోట్లు పలికిన విషయం తెలిసిందే. కానీ నాలుగు రోజులు కూడా గడవకముందే ఆ రికార్డు మట్టి కరిపించింది. ఎకరానికి రూ.151.25 కోట్లు పలకడంతో ఈ ప్రాంత భూములు బంగారం కంటే విలువైనవిగా నిలిచాయి. అంతకుముందు 2023లో ఇదే ప్రాంతంలో ఎకరానికి రూ.73 కోట్లు మాత్రమే లభించగా, ఈసారి ధరలు 87% మేర పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
నియోపోలిస్ ప్రత్యేకతలు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ఆధునిక నగర నిర్మాణానికి ప్రతిరూపంగా మారింది.
• దాదాపు 40 ఎకరాల్లో రూ.300 కోట్లతో అభివృద్ధి
• 45 మీటర్ల వెడల్పైన రోడ్లు
• సైక్లింగ్ ట్రాక్‌లు
• భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
• అత్యాధునిక విద్యుత్ సదుపాయాలు
• అపార్మెంట్‌లు, వాణిజ్య భవనాలు, వినోద కేంద్రాల నిర్మాణానికి ఫ్రీ ఎఫ్‌ఎస్‌ఐ అనుమతులు
ఈ సదుపాయాలు, నిర్మాణాలకు ఆకాశమే హద్దు అనుమతులు కావడంతో ఇవన్నీ కలిసి ఈ ప్రాంత విలువను అసాధారణ స్థాయికి పెంచాయి.
హెచ్‌ఎండీఏ ఏం చెప్పంది
హెచ్‌ఎండీఏ ఇప్పటికే కోకాపేట నియోపోలిస్‌లో 29 ఎకరాలతో పాటు మూసాపేటలో 16 ఎకరాలను వేలానికి సిద్ధం చేసింది. డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లు హ్యామర్ క్రింద రానున్నాయి.
• కోకాపేట నియోపోలిస్ ప్లాట్ల ప్రారంభ ధర: రూ.99 కోట్లు
• గోల్డెన్ మైల్ ప్లాట్లు: రూ.70 కోట్లు
• మూసాపేట ప్లాట్లు: రూ.75 కోట్లు
రియల్ ఎస్టేట్ పరిశ్రమ నిపుణులు చెబుతున్నదేమంటే కోకాపేట భూముల ధరలు ఇక్కడితో ఆగవనీ, ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

