Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి.. కేంద్రం ఉత్తర్వులు.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. గవర్నర్ నియామకాల్లో గోవా, హర్యానా, లడ్డాఖ్ ప్రాంతాలకు కొత్త పేర్లు ఖరారు అయ్యాయి. హర్యానా రాష్ట్రానికి అశిన్ కుమార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన లడ్డాఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. వీరితో పాటు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ఎంపికయ్యారు.
అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం
విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు, తెలుగుదేశం పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుల్లో ఒకరు. ఆయన దశాబ్ధాలుగా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రి పదవిలోనూ సేవలందించారు. ముఖ్యంగా పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.
రాజకీయాలకు తాత్కాలిక విరామం
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి అశోక్ గజపతిరాజు కొంత దూరంగా ఉన్నారు. అయితే, ఇటీవల ఆయనను గవర్నర్ పదవికి కేంద్రం నియమించవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఊహాగానాలు నిజమవుతూ.. గోవా గవర్నర్‌గా ఆయన నియామకాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.