Weather Update: ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎయిర్ సైక్లోనిక్ ప్రభావంతో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 12న తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్‌డేట్ వివరాలు మీకోసం.

బెంగాల్ తీరం దాటుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల పై ప్రభావం ఉందా?
బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. కానీ ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు కాస్త దూరంగా, బెంగాల్ సమీపంలో కేంద్రీకృతమై ఉండి, కోల్‌కతా మీదుగా తీరం దాటబోతోంది. దీనివల్ల అక్కడ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ అల్పపీడనం వల్ల ఏర్పడిన ఉపరితల వాయు చక్రవాత తుపాను దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ భారతదేశం వైపుగా చొచ్చుకొచ్చింది. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తెలంగాణ లో అక్కడక్కడ వర్షాలు
ఆగస్టు 12న తెలంగాణ అంతటా మేఘాలు క్రమంగా ఆవరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగవచ్చు. సాయంత్రం వేళ హైదరాబాద్‌తో పాటు మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇక్కడ భారీ వర్షం పడకపోవచ్చు, ప్రధానంగా వాన జల్లులే పడతాయి. ఇక పగటి ఉష్ణోగ్రత 28°C నుండి 30°C మధ్య నమోదు కావచ్చు, రాత్రి వేళల్లో 23°C నుండి 24°C వరకు తగ్గే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్లుగా ఉండవచ్చు.
ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఆకాశం మేఘావృతం, పిడుగుల భయం
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి తేమ వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్రలో సాయంత్రం వేళ ప్రారంభమయ్యే జల్లులు రాత్రి వరకు పడే ఛాన్స్ ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడవచ్చు, కానీ రాయలసీమలో మాత్రం ఎక్కువ భాగం పొడి వాతావరణమే కనిపిస్తోంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల సడెన్‌గా వర్షం స్టార్ట్ అయి కాసేపటికే ఆగిపోయే ఛాన్స్ ఉంది. పగటి ఉష్ణోగ్రత 30°C నుండి 33°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, తేమ ప్రభావం వల్ల కొంచెం ఎక్కువ వేడిగా అనిపించవచ్చు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
మత్స్యకారులకు ఐఎండీ సీరియస్ వార్నింగ్
బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఈదురుగాలుల ప్రభావం బలంగా ఉంది. అరేబియా సముద్రంలో గాలులు గంటకు 70 కి.మీ వేగంతో వీస్తుండగా, తెలంగాణలో 40 కి.మీ, ఏపీలో 45 కి.మీ వేగంతో గాలుల ప్రభావం వుంటుందని ఐఎండీ తెలిపింది. సముద్రంలో అండర్ కరెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీరప్రాంతం, బీచ్‌లకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలుల ప్రభావంతో సముద్రం లోపలికి లాక్కుపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, ఆగస్టు 15 వరకు ఉత్తరాంధ్ర సహా ఏపీ మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
పసిఫిక్ మహాసముద్రంలో వేడి.. ఎల్ నినో ముప్పు మరింత పొంచి ఉందా?
వాతావరణంలో ఒక కలవరపెట్టే విషయం ఏమిటంటే.. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. అక్కడ ప్రస్తుతం దాదాపు 8 అల్పపీడనాలు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదివరకే డాల్ఫిన్ తీవ్ర తుపాను చైనా వైపు వెళ్లిపోయినా ఇంకా ఇన్ని అల్పపీడనాలు ఉండటం అంటే ఎల్ నినో ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఆగస్టు నెలలో పడాల్సిన సగటు వర్షపాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాతావరణంలోని ఈ మార్పుల దృష్ట్యా రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ సాగునీటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం చాలా అవసరం అని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

