- Home
- Andhra Pradesh
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కుబేరా సినిమాను మించిన ట్విస్టులు.. అసలేం జరిగిందంటే
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కుబేరా సినిమాను మించిన ట్విస్టులు.. అసలేం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇంతకీ ఏంటీ లిక్కర్ స్కామ్.? ఇప్పటి వరకు ఏం జరిగింది.? లాంటి పూర్తి వివరాలు..

అసలేంటీ లిక్కర్ స్కామ్.?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. ఏపీలో ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాలకు రంగంలోకి దిగింది. ఫలితంగా అన్ని ప్రైవేట్ షాపులు మూసివేసి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించారు.
ప్రభుత్వ దుకాణాల పేరుతో నడుస్తున్నా, అసలు నియంత్రణ మాత్రం అధికార పార్టీ నేతల అధీనంలోనే ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ దుకాణాల్లో ఎక్కువగా వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీల్లో తయారైన చౌక మద్యం మాత్రమే అందించారని ఇందుకోసం వేల కోట్లు ముడుపులు అప్పజెప్పారనేది ఈ లిక్కర్ స్కామ్‌లో వస్తోన్న ప్రధాన ఆరోపణ.
భారీగా పెరిగిన మద్యం ధరలు
ఇక వైసీపీ హయాంలో మద్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. ‘తాగేవాళ్లకు షాక్ కొట్టేలా ధరలు ఉండాలి’ అనే పేరుతో రేట్లు పెంచినా, అందిస్తున్న మద్యం నాణ్యత చాలా తక్కువగా ఉందని వినియోగదారులు ఆరోపించారు. ఇక ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వైసీపీ హయాంలో కమీషన్ రూపంలో ఏకంగా రూ.3,700 కోట్లకుపైగా ముడుపులు ముట్టినట్లు విచారణలో ప్రాథమికంగా తేలింది. లేబుల్ రీన్యువల్స్, ENA అమ్మకాల వంటి ఇతర వనరులు కలిపితే మొత్తం ఆదాయం రూ.4,000 కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? ఏ రోజు ఏం జరిగింది.?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ స్కామ్‌పై విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఏ1గా కేసిరెడ్డి ఉన్నారు. ఇక మద్యం కేసులో ఏ4గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
* 2024 సెప్టెంబర్ 25న కేసు నమోదు చేసిన సీఐడీ
* 2024 అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టిలరీ కంపెనీల్లో తనిఖీలు
* 2025 ఫిబ్రవరి 5న మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో
* 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిట్
* విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం ఏడుగురు సభ్యులతో సిట్
* సిట్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించిన ప్రభుత్వం
* ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు అంశాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
* మార్చి 12న సిట్ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి
* మద్యం కుంభకోణం కీలకపాత్రధారి రాజ్ కేసిరెడ్డి అని మీడియాకు తెలిపిన విజయసాయిరెడ్డి
* మార్చి 21న ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ మిథున్‌రెడ్డి
* మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని మిథున్‌రెడ్డి పిటిషన్
* ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రాజ్ కేసిరెడ్డి కంపెనీలు, నివాసంలో సిట్ తనిఖీలు
* ఏప్రిల్ 16న రాజ్ కేసిరెడ్డికి సిట్ నోటీసులు
* ఏప్రిల్ 19న విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు
* నాలుగుసార్లు రాజ్ కేసిరెడ్డికి సిట్ నుంచి నోటీసులు
* ఏప్రిల్ 15న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు
* ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరుకావాలని విజయసాయిని కోరిన సిట్
* ఏప్రిల్ 18న విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
* ఏప్రిల్ 18న సిట్ విచారణకు వచ్చిన రాజ్ కేసిరెడ్డి తండ్రి ఉపేంద్ర
* ఏప్రిల్ 19న సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి
* ఏప్రిల్ 21న హైకోర్టులో రాజ్ కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
* ఏప్రిల్ 22న విదేశాలకు పారిపోయే యత్నంలో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్
* ఏప్రిల్ 24న మద్యం కేసులో బూనేటి చాణక్య అరెస్ట్
* ఏప్రిల్ 25న మద్యం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్
* మే 2న మద్యం కేసులో నిందితుడు దిలీప్ అరెస్ట్
* మే 8న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు
* మద్యం కుంభకోణంపై వివరాలు కోరిన ఈడీ
* మే 8న ఈడీ అధికారుల నుంచి సిట్‌కు అందించిన లేఖ
* మే 9న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులు
* మే 14న గోవిందప్ప బాలాజీని కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన సిట్
* మే 14న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరు
* మే 16 వరకు మూడు రోజులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విచారణ
* ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
* మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
* జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడును ఎయిర్‌పోర్టులో అడ్డిగింత. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇద్దరినీ అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
* జూన్ 18న బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి, వెంకటేశ్‌నాయుడిని అరెస్ట్ చేసిన సిట్
* జులై 12న సిట్ విచారణకు హాజరుకావాలని విజయసాయికి నోటీసులు
* సిట్‌కు సమాచారం ఇచ్చి విచారణకు గైర్హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
* జూలై 19న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్.
జగన్ పేరు ప్రస్తావన
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో ప్రైమరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సిట్ వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించింది. ఆయనకు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంది. కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్‌రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ అనే 8మంది పేర్లను జత చేసింది. తాజా జాబితాతో లిక్కర్ కేసులోని నిందితుల సంఖ్య 48కి చేరింది.
విస్తుపోయే నిజాలు
లిక్కర్ స్కామ్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉచ్చులో అనేక మంది ఉన్నత విద్యావంతులైన యువకులు చిక్కుకున్నారని సిట్ విచారణలో తేలింది. ఖరగ్‌పుర్, మద్రాస్ వంటి ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో చదువుకుని పట్టభద్రులైన కొందర్ని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చినట్లు తేలింది. కొంతమంది ఉన్న విద్యావంతులైన యువకులను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా, వాటిని ఒకచోట నుంచి మరో చోటకు చేర్చే హ్యాండ్లర్లుగా మారినట్లు వార్తలు వచ్చాయి.
ఈ డబ్బుతో ఏం చేశారంటే.?
మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సొమ్ముతో నిందితులు విలాసవంతమైన జీవితం గడిపారని సిట్ దర్యాప్తులో తేలింది. ఆ డబ్బుతో వారు భూములు, ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు సినిమాలు నిర్మించటం, స్టార్టప్ కంపెనీలు ప్రారంభించినట్లు గుర్తించారు. విదేశీ పెట్టుబడులకు సైతం ప్రయత్నాలు చేసినట్లు విచారణలో తేలింది.
ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 92 ఎకరాల భూమి కొనుగోలు చేశారని సిట్ తెలిపింది. ఈ భూముల విలువ కొనుగోలు సమయంలోనే 100 కోట్లకు పైగా ఉందని అంచనా. ఖరీదైన కార్లు, రిసార్టుల్లో బస, తరచూ విదేశీ పర్యటనలు నిర్వహించినట్లు కూడా తేలింది.
విదేశీల్లో పెట్టుబడులు, హవాలా మార్గాలు
జాంబియా, టాంజానియా వంటి దేశాల్లో మైనింగ్, ఇనుప ఖనిజ తవ్వకాలకు సన్నాహాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హవాలా మార్గాల్లో డబ్బులు తరలించి యూఏఈ, జింబాబ్వే, థాయ్‌లాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు. ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి దుబాయ్, యూకేలో పలు కంపెనీలు స్థాపించినట్లు గుర్తించారు.
వైసీపీ వాదన ఏంటంటే.?
ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం లిక్కర్ స్కామ్ అంతా ఉట్టిదే అంటోంది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో పెట్టిన కేసే అంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని, తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతుందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. మరి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.