- Home
- Andhra Pradesh
- Cyclone Aquan: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. భారీ వర్షాల హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Cyclone Aquan: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. భారీ వర్షాల హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Cyclone Aquan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను శుక్రవారం నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు.

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అక్వాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి అక్వాన్ తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
ఆ తర్వాత మరింత బలపడి గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే ఛాన్స్ ఉంది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గరిష్ఠంగా గంటకు 120 నుంచి 130 కి.మీ., కొన్నిసార్లు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ అక్వాన్ అతి తీవ్ర తుపాను ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం నుంచే అక్కడక్కడ వర్షాలు ప్రారంభం కానుండగా.. గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి వంటి మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో పలు చోట్ల 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది.
సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం ఆయన వాతావరణ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రభావిత ప్రాంతాలకు ముందస్తుగానే ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను తరలించాలని స్పష్టం చేశారు. అలాగే ప్రసవ సమయం దగ్గరపడిన 377 మంది గర్భిణులను ఇప్పటికే సురక్షితంగా ఆసుపత్రులకు తరలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వె వెల్లడించింది.
మత్స్యకారులకు హెచ్చరికలు.. రైతులకు సూచనలు
తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుండటంతో, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.
అత్యవసర సహాయం కోసం నంబర్లు
తుపాను సంబంధిత సమస్యలు, అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రత్యేక సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచింది. ప్రజలు ఎలాంటి సహాయం కోసమైనా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు సమాచారం అందించవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలంగాణ లోనూ భారీ వర్షాలు.. పెరిగిన చలి
ఇక తెలంగాణలో కూడా తుపాను ప్రభావం వుంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
వీటితో పాటు ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇదిలావుండగా, తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు చాలా జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది.









