- Home
- Telangana
- Cyclone Akvan : తీవ్ర కాదు అత్యంత తీవ్ర తుపానుగా అక్వాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, గాలివానలతో అల్లకల్లోలమే
Cyclone Akvan : తీవ్ర కాదు అత్యంత తీవ్ర తుపానుగా అక్వాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, గాలివానలతో అల్లకల్లోలమే
అక్వాన్ తుపాను ప్రభావంతో కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు తెలంగాణలోనూ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయో తెలుసా?

అక్వాన్ తుపాను లోడింగ్
Cyclone Akvan : ఎల్ నినో ఎఫెక్ట్ తో ఈ వర్షాకాలమంతా పెద్దగా వానలు పడలేవు... దీంతో దేశంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాలను తుపానులు చుట్టుముట్టాయి... మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అర్నబ్, మురసు తుపానులు ఏపీ తీరాన్ని తాకాయి... దీంతో పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. వీటిని మర్చిపోకముందే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది... ఇదికూడా ఏపీ తీరంవైపు దూసుకు వస్తోందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతానికి చెన్నైకు700 కి.మీ, విశాఖపట్నంకు 800 కి.మీ, గోపాల్పూర్ కు 910కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ (నవంబర్ 16, సోమవారం) సాయంత్రానికి ఇది తుపానుగా, రేపు (నవంబర్ 17, మంగళవారం) తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ అక్వాన్ తుపాను పశ్చిమవాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకువస్తుందని APSDMA తెలిపింది. శుక్రవారం (నవంబర్ 20) మధ్యాహ్నానికి అతితీవ్ర తుపానుగా నెల్లూరు- తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. గత తుపానుల మాదిరిగానే ఈ తుపాను తీరందాటే సమయంలో భారీ ఈదురుగాలులు, వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత భారీ వర్షాలు
అక్వాన్ తుపాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై బలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వచ్చే గురు, శుక్రవారం రెండ్రోజులు కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ప్రచండ ఈదురుగాలులతో భారీ నుండి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయట. రాయలసీమ, యానాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయట. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... రైతాంగం వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA హెచ్చరిస్తోంది.
తెలంగాణకు రెడ్ అలర్ట్
అక్వాన్ తుపాను ఎఫెక్ట్ కేవలం ఏపీపైనే కాదు తెలంగాణపైనా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి దగ్గర్లోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తుపాను ప్రభావంతో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ రెడ్ అలర్ట్ జారీచేశారు. ఏకంగా 150-200 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.
పశ్చిమ తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు... అయితే కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు పడితే మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయంటున్నారు. ఇలా నవంబర్ 20 నుండి 22 వరకు అంటే వచ్చే శుక్ర, శని, ఆదివారాలు మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.... మరీముఖ్యంగా 21న తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
అక్వాన్ తుపానుపై చంద్రబాబు సర్కారు అలర్ట్
అర్నబ్, మురసు తుపానుల మాదిరిగానే ఈ అక్వాన్ ను కూడా ఎదుర్కొనేందుకు ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటినుండే సిద్దమవుతోంది. ఈ తుపాను నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనేదానిపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. ఇందుకోసమే ఇవాళ (నవంబర్ 16) సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా, ఆ తదుపరి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి... ఆర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా వివిధ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టి ఈ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని... అవసరమైన ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
పంటలను కాపాడే చర్యలు చేపడుతున్నాం..: అచ్చెన్నాయుడు
అక్వాన్ తుపాను కారణంగా పంటనష్టం లేకుండా, రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. అధికారులే కాదు రైతులు, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావంతో పంటలకు నష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 23.87 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తుపాను ప్రభావిత 16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు.
మొత్తం 30,808 మత్స్యకార బోట్లలో ఇప్పటికే 30,635 బోట్లు సురక్షితంగా తీరం చేరాయి... మిగిలిన 173 బోట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులకు ఇప్పటికే 1,08,250 వాయిస్ హెచ్చరికలు.. నాభిమిత్ర ద్వారా 8,217 బోట్ల ట్రాకింగ్ చేపట్టామన్నారు.
తుపాను కారణంగా ఉద్యాన పంటలకు నష్టం జరిగితే 24 గంటల్లో ప్రాథమిక రిపోర్ట్.. వారం రోజుల్లో రైతులవారీగా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల పంటలు, మత్స్యకారుల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం.. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం లేకుండా జాగ్రత్త పడతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అత్యవసర సాయంకోసం ఈ నంబర్లను సంప్రదించండి
అక్వాన్ తుపాను తీరందాటే సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే ప్రజలు కంగారుపడవద్దని.. సహాయం కోసం సంప్రదించాలంటూ కొన్ని నంబర్లను విడుదలచేసింది ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA). సాయంకోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 న లేదంటే 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.









