- Home
- Technology
- Robot Trainers: ఇంట్లో గిన్నెలు కడిగితే రూ. 85 వేలా? ఈ కొత్త జాబ్ చూస్తే షాక్ అవుతారు
Robot Trainers: ఇంట్లో గిన్నెలు కడిగితే రూ. 85 వేలా? ఈ కొత్త జాబ్ చూస్తే షాక్ అవుతారు
Robot Trainers: చైనాలో రోబోలకు శిక్షణ ఇచ్చే రోబోట్ ట్రైనర్స్ ఉద్యోగాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. మనుషుల పనులను నేర్పుతున్న ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గృహ కార్మికుల ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం తెలిస్తే షాక్ అవుతారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రోబోలకు మానవ స్పర్శ.. కొత్త ఉద్యోగాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాల్లో టెక్నాలజీ వేగంగా దూసుకుపోతోంది. అయితే, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మనుషుల సాధారణ శారీరక కదలికలను, పనులను యంత్రాలకు నేర్పడం మాత్రం ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా చైనాలో ఇప్పుడు రోబోట్ ట్రైనర్స్ అనే సరికొత్త ప్రొఫెషన్ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రోబోట్ ట్రైనర్స్ బాధ్యతలు ఏమిటి?
ఇళ్లలోనూ, ఫ్యాక్టరీలలోనూ మనుషులను పోలి ఉండేలా ఏఐ సిస్టమ్స్‌ను మార్చడమే ఈ ట్రైనర్ల ప్రధాన లక్ష్యం. దీనికోసం వీరు చాలా కష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ శరీరానికి మోషన్ క్యాప్చర్ సెన్సార్లు, సెన్సార్ బ్రాస్లెట్లు, తలపై కెమెరాలు అమర్చుకుంటారు. కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చే ఆదేశాల ప్రకారం బట్టలు మడవడం, పాత్రాలు కడగడం, కప్పులు తీయడం, టేబుల్స్ తుడవడం వంటి పనులను రోజూ చేస్తారు. వీరు చేసే ప్రతి కదలికను డేటాగా రికార్డు చేస్తారు. భవిష్యత్తులో రోబోలు నేర్చుకోవడానికి వీలుగా దీన్ని ఒక ట్రైనింగ్ సెట్ లా మారుస్తారు.
కఠినమైన శ్రమ.. మానసిక ఒత్తిడి
చైనాలో ఇలాంటి ఉద్యోగ ప్రకటనలు విపరీతంగా వస్తుండటంతో చాలా మంది యువకులు, ఉద్యోగం కోల్పోయిన పెద్దలు, ఇంటర్న్‌షిప్ కోరే విద్యార్థులు దీనివైపు ఆకర్షితులవుతున్నారు. వీరికి నెలకు 4,000 నుండి 6,000 యువాన్ల వరకు అంటే దాదాపు 85,000 భారతీయ రూపాయిల జీతం లభిస్తుంది. అయితే దీని వెనుక పెద్ద ఎత్తున శారీరక, మానసిక ఒత్తిడి ఉంది. ప్రతిరోజూ వీరు కొన్ని టార్గెట్లు రీచ్ కావాలి. కొందరైతే రోజుకు 200 సార్లు గిన్నెలు కడగడం, టేబుల్స్ తుడవడం చేస్తుంటారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా వీరి వేగం, పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. అయితే, "రోబోట్లను ట్రైనింగ్ ఇవ్వడం అంటే చిన్నపిల్లాడికి పనులు నేర్పించినట్లే ఉంటుంది" అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటాయా?
తమ కష్టానికి తగిన జీతం రావడం లేదని చాలా మంది కార్మికులు వాపోతున్నారు. అంతేకాదు, ఈ రంగంలో ఒక పెద్ద ప్రమాదం కూడా దాగుంది. "మనుషులు రోబోట్లకు పనులు నేర్పుతున్నారు.. కానీ, రేపు అదే రోబోలు తమకు శిక్షణ ఇచ్చిన మనుషుల ఉద్యోగాలనే లాగేసుకుంటాయి" అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత ఎంతగానో సహాయపడినప్పటికీ, ఇది భవిష్యత్తు ఉద్యోగాలను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
చైనాలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచంలోని ఇతర దేశాలకు, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు పెద్ద హెచ్చరిక లాంటివి. మన దేశంలో గృహ కార్మికులకు, డొమెస్టిక్ వర్కర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. కోట్ల మంది ఈ రంగాన్నే నమ్ముకుని బతుకుతున్నారు. కానీ, హ్యూమనాయిడ్ రోబోట్లు, ఏఐ రాకతో రాబోయే రోజుల్లో వంటపనులు, ఇళ్ల పనులను రోబోలే చేసే అవకాశం ఉంది. అలా జరిగితే మన దేశంలోని గృహ కార్మిక రంగంలో పనిచేస్తున్న వారిపై ప్రభావం పడే అవకాశాలు కూడా లేకపోలేదు.













