- Home
- Andhra Pradesh
- తెలుగు కపుల్స్ కి బంపరాఫర్... మూడో బిడ్డను కంటే డబ్బులకు డబ్బులు, సెలవులకు సెలవులు
తెలుగు కపుల్స్ కి బంపరాఫర్... మూడో బిడ్డను కంటే డబ్బులకు డబ్బులు, సెలవులకు సెలవులు
Population Management Policy : జనాభాను ఎలా నియంత్రించాలి అనే స్థాయినుండి ఇప్పుడు జనాభాను ఎలా పెంచాలి అనే స్థాయికి భారతదేశం చేరింది. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ముగ్గురు, అంతకంటే ఎక్కువమంది పిల్లలుంటే ప్రత్యేక బెనిఫిట్స్ అందిస్తామంటోంది.

పిల్లల్ని కనండి... బెనిఫిట్స్ పొందండి..
Population Management Policy : గతంలో జనాభా నియంత్రణకు అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలే ఇప్పుడు ఎక్కువమంది పిల్లలను కనమంటున్నాయి. ''ఒక్కరు ముద్దు... ఇద్దరు వద్దు'', ''మనమిద్దరం-మనకిద్దరు'' వంటి నినాదాలు ఇచ్చినవారే ఇప్పుడు ''ముగ్గురు ముద్దు'' అంటున్నారు... అంటే ఒకరిద్దరు పిల్లలు చాలన్న పాలకులే ముగ్గురు, నలుగుర్ని కనమంటున్నారు. ఇన్నిరోజులు ఎక్కువమంది పిల్లలుంటే ఎన్నికలకు అనర్హులు, పథకాలకు అనర్హులు... ఇకపై ఎంత ఎక్కువమంది పిల్లలుంటే అంత ఎక్కువ ప్రయోజనాలు. ఇలా మళ్లీ మన పూర్వీకుల బాటలో నడుస్తూ గంపెడు పిల్లలతో కూడిన కళకళలాడే కుటుంబాలను భవిష్యత్ లో చూడబోతున్నాం. ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది... ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకువచ్చేందుకు సిద్దమయ్యింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో ఈ ముసాయిదాపై ప్రకటన చేశారు.
మూడో బిడ్డను కంటే బంపరాఫర్స్...
గతంలో ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి, కొన్ని సంక్షేమ పథకాలకు అనర్హులు... కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కుమంది పిల్లలుంటే ప్రభుత్వాలే ప్రత్యేక సౌకర్యాలను అందించేందుకు సిద్దమయ్యాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ దంపతులైనా మూడో సంతానానికి జన్మనిస్తే ప్రత్యేక ఆర్థికసాయం పొందనున్నారు. డెలివరీ సమయంలో ఆ దంపతులకు రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కేవలం ప్రోత్సాహక సాయంతో సరిపెట్టుకోకుండా ఈ బిడ్డ పోషణ తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.1000 తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేయనుంది... ఇలా బిడ్డ ఐదేళ్ల వయసువరకు ఆర్థికసాయం అందుతుంది. ఇలా మరో రూ.60,000 లభించనున్నాయి.
ఎక్కువమంది సంతానం ఉండటంతో వారి చదువు పేరెంట్స్ కి భారంగా మారుతుంది. దీనికి కూడా ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మూడో సంతానానికి 18 ఏళ్ళ వయసువరకు ప్రభుత్వమే ఉచితంగా విద్య అందించేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు విద్యాశాఖలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇలా ఎక్కువమంది పిల్లలను కనేలా దంపతులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందిస్తోంది.
తల్లికి మెటర్నిటి, తండ్రికి పెటర్నిటి లీవ్స్...
ఇప్పటివరకు కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే మెటర్నిటీ లీవ్స్ అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ముగ్గురు, అంతకంటే ఎక్కువమంది సంతానం కోసం కూడా మెటర్నిటీ సెలవులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది పిల్లలున్నారు అనేది సంబంధం లేదు... గర్భధారణ, ప్రసవ సమయంలో మహిళలకు 12 నెలలపాటు మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు. అంతేకాదు బిడ్డను చూసుకునేందుకు తండ్రికి కూడా 2 నెలలపాటు పెటర్నిటీ లీవ్స్ ఇవ్వనున్నారు. ఇలా తల్లిదండ్రులిద్దరికీ సెలవులు ఇచ్చేలా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించింది ప్రభుత్వం.
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ...
'పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ' ముసాయిదాను సిద్దం చేశామని... దీన్ని ప్రజలముందు ఉంచనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని... వాటినే అమలుచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వ సంకల్పాన్ని అర్ధం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేవలం ఎక్కువమంది పిల్లలను కనమని చెప్పడమే కాదు.. వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహిస్తేనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా నిలుస్తుందని అన్నారు. ప్రజాహితం కోసం, ఆర్ధిక అసమానతలను తొలగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఫలాలు చాలాకాలం తర్వాత వస్తాయన్నారు. ఇప్పుడు ప్రణాళికలు చేస్తేనే వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో సమాజంలో సుస్థిరత, సంపద, సమృద్ధి చేకూరతాయి... ఇందుకు హైదరాబాద్ ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. తెలుగు ప్రజల అత్యున్నత జీవన ప్రమాణాల కోసం పునాది వేశాం... అందుకే హైదరాబాద్ ఇప్పుడు అత్యుత్తమ నగరంగా ఎదిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఏప్రిల్ 1 నుండి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు...
మార్చి నెలాఖరు వరకు కొత్తగా తీసుకువచ్చే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి ఇందులోని అంశాలపై చర్చలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతీ నెల నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి తుది రూపు ఇచ్చి ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని ఈ ఐదు పాపులేషన్ మేనేజ్‌మెంట్‌కు మూలస్తంభాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

