- Home
- Andhra Pradesh
- Andhra pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 7న ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయం
Andhra pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 7న ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయం
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

71 వేలకుపైగా కుటుంబాలకు రూ.179 కోట్ల సాయం
‘నేతన్న సేవలో’ పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.179 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు, సంప్రదాయ చేనేత వృత్తిని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల హామీల్లో ఈ పథకం లేకపోయినా, చేనేత రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
చేనేత కార్మికులకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు
కొత్త పథకంతో పాటు చేనేత కార్మికులకు ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు ప్రయోజనం పొందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే 50 ఏళ్లు పూర్తైన 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తూ, ఏడాదికి సుమారు రూ.420 కోట్లు వెచ్చిస్తోంది.
చేనేత రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు
చేనేత రంగాన్ని ఆధునికీకరించేందుకు ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్ సౌకర్యం కల్పించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి సమీపంలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా అమలులో ఉంది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం పర్యటన
జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7వ తేదీ) సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించే సభలో పాల్గొని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అనంతరం జాండ్రపేటలో చేనేత కార్మికుల వర్క్‌షాప్‌ను సందర్శించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్నారు.

