- Home
- Andhra Pradesh
- వారంలో 6 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చికెన్.. విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
వారంలో 6 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చికెన్.. విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే ఆహారం మరింత నాణ్యంగా ఉండేలా డైట్ ఛార్జీలను పెంచింది.

3 నుంచి 6వ తరగతి వారికి రూ.1,265
3 నుంచి 6వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు నెలకు రూ.1,150గా ఉన్న డైట్ ఛార్జీని రూ.1,265కు పెంచారు. అంటే ఒక్కో విద్యార్థిపై నెలకు రూ.115 అదనంగా ఖర్చు చేయనున్నారు. పెరిగిన మొత్తంతో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు.
7 నుంచి 10వ తరగతి వారికి రూ.1,600
7 నుంచి 10వ తరగతి విద్యార్థుల డైట్ ఛార్జీలను రూ.1,400 నుంచి రూ.1,600కు పెంచింది ప్రభుత్వం. అలాగే ఇంటర్, ఆపై తరగతుల్లో చదివే విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న రూ.1,600 డైట్ ఛార్జీని రూ.1,800కు పెంచారు. ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వారంలో ఆరు రోజులు గుడ్లు.. మూడు రోజులు చికెన్
పెరిగిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా హాస్టళ్లు, గురుకులాల్లో కొత్త మెనూను అమలు చేయనున్నారు. విద్యార్థులకు వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్ అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రోజూ పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాలతో తయారు చేసే చిక్కీలు, రాగి లడ్డూలతో పాటు పప్పులు, ఆకుకూరలు, ఇతర కూరగాయలను మెనూలో భాగంగా చేర్చనున్నారు. సమతుల్య ఆహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారమే లక్ష్యం
డైట్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన మొత్తంతో విద్యార్థులకు మరింత రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఏర్పడుతుందని ఆమె తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో విద్యతో పాటు విద్యార్థుల ఆహార భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత కృతజ్ఞతలు
బీసీ విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో పెట్టుకుని డైట్ ఛార్జీలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు సొంతింటి వాతావరణాన్ని గుర్తు చేసేలా మెరుగైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

