Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం... ఈ తెలుగు జిల్లాల్లో ఇక కుండపోతే
జూన్ ఆరంభంనుండి ఎదురుచూస్తే నెల చివరికి వరుణుడు తెలుగు రాష్ట్రాలను కరుణిస్తున్నాడు. ఇకపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Telugu States Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇక భారీ వర్షాలు మొదలు కానున్నాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పటికే రుతుపవనాలు చురుగ్గా మారి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో రాబోయే మూడురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఉత్తర కోస్తాలో భారీ వర్షాలుంటాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో మాత్రం మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఈ వర్షాలకు భారీ ఈదురుగాలులు తోడవుతాయని... తీరం వెంబడి మరింత బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలో జోరు వానలు
ఇక తెలంగాణలో కూడా ప్రస్తుతం కురుస్తున్నాయి.. కానీ ఆశించిన స్థాయిలో కాదు. దీంతో వర్షాధార పంటలువేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. వీరికి సంతోషాన్ని కలిగించేలా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు వేగంగా మారి ఇవాళ రాత్రి లేదా గురువారం ఉదయం వర్షాలు మొదలవుతాయని ప్రకటించారు.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. గంటకు 30 నుండి 4ే0 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ లో వర్షాలు
హైదరాబాద్ విషయానికి వస్తే ఆకాశం మేఘాలతో కప్పేసి వాతవరణం చల్లగా ఉంది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. అయితే గురువారం నుండి నగరంలో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ మియాపూర్, నిజాంపేట, బాచుపల్లి, జీడిమెట్ల, గాజులరామారం, యాప్రాల, కుత్బుల్లాపూర్, దమ్మాయిగూడ, నాగారం, ఈసిఐఎల్, నాచారంం, చెంగిచెర్ల ప్రాంతాల్లో చిరుజల్లుకు కురిసాయి.