తెలంగాణ రైతుల ఎదురుచూపులకు తెరపడినట్లే కనిపిస్తోంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే. ప్రస్తుత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి.. ఇవి ఈ రాత్రికి మరింత జోరందుకునే అవకాశాలున్నాయట.

Telangana Rains : తెలంగాణ ప్రజలకు చల్లనికబురు... రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో చిరుజల్లులు కురియగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలతో పాటు కరీంనగర్ లో కూడా వర్షం కురిసింది. ఇక వరంగల్ రూరల్ ప్రాంతాలు పరకాల, నర్సంపేటతో పాటు భయ్యారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి.

అయితే రాత్రి తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు వర్షాలు వ్యాపించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రుతుపవనాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడయ్యిందని... దీని ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ రైతులకు తీపికబురు :

తాజాగా మొదలైన వర్షాలు తెలంగాణ రైతుల ముఖాల్లో చిరునవ్వు తెప్పించాయి. మే చివర్లో రుతుపవనాల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి వర్షాకాలం ముందుగానే మొదలయ్యింది. తొలకరి జల్లులు కురవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా మరికొందరు పంటలు వేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో జూన్ ఆరంభంనుండి ఇప్పటివరకు వర్షాలు లేవు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ఎండాకాలంలో వర్షాలు కురిసాయి... తీరా వర్షాకాలం మొదలయ్యాక మేఘాలు ముఖం చాటేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే జూన్ చివర్లో మళ్లీ వర్షాలు మొదలవడంతో రైతుల్లో ఆనందం మొదలయ్యింది. అయితే ఈ వర్షాలు మున్నాళ్ల ముచ్చటేనా లేక ఈ వర్షాకాలమంతా ఇక వానలు కొనసాగుతాయా అన్న ఆందోళన ఉంది.

ఆ దేవుడిపై భారం వేసి వ్యవసాయం చేస్తున్నాం... విత్తనాల సమయంలో వర్షాలు సమయానికి కురవకున్నా, పంట చేతికందే సమయంలో ఎక్కువ కురిసినా నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. వర్షాలు అనుకూలిస్తే పంట చేతికివస్తుంది... లేదంటే ఆ భూతల్లికే అంకితం అవుతుందంటూ రైతులు తమ నిస్సహాయతను తెలియజేస్తున్నారు. అయితే ఎన్ని నష్టాలున్నా తమకు తెలిసింది వ్యవసాయం ఒక్కటే... భూతల్లిని నమ్ముకుని జీవిస్తామని రైతులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఆహ్లాదకర వాతావరణం :

ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో ఎండకాసింది... ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. కొన్నిప్రాంతాల్లో జల్లులు లేకుండా వెదర్ కూల్ గా మారింది. ఇలా నగరంలో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

లింగంపల్లి, పటాన్ చెరు, చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. అలాగే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లగా మారి అక్కడక్కడ జల్లులు కురిసాయి. పాతబస్తీ ప్రాంతంలో కూడా తేలికపాటి జల్లులు కురిసాయి.