గోధుమ పిండికి చాలా త్వరగా పురుగులు పడుతుంటాయి. కానీ మీరు ఒక పనిచేస్తే మాత్రం ఎన్ని రోజులు నిల్వ ఉన్నా గోధుమ పిండికి అస్సలు పురుగులు పట్టవు. 

ఒకప్పుడు అయితే ఎక్కువగా రాగులు, జొన్నల రొట్టెలు చేసుకుని తినేవారు. కానీ ఇప్పుడు గోధుమ చపాతీలను ఎక్కువగా తింటున్నారు. అన్నం తింటే బరువు పెరుగుతున్నామని రెండు పూటలా అన్నం తినేసి ఒక పూట మొత్తం చపాతీలనే తినేవారున్నారు. ఇలాంటి వారు గోధుమ పిండిని ఒకేసారి ఎక్కువగా కొనేసి పెడుతుంటారు. కానీ దీనివల్ల గోధుమ పిండికి పురుగులు పట్టే అవకాశం ఉంది. 

మీరు ఎప్పుడైనా గమనించారా? మైదా పిండికంటే గోధుమ పిండికే తొందరగా పురుగులు పడతాయి. కానీ దీనివల్ల పిండిని ఉపయోగించాలనిపించదు. కొంతమంది అయితే పిండిలో పురుగులను తీసేసి చపాతీలను చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం పురుగులు పట్టిన పిండిని డైరెక్ట్ గా డస్ట్ బిన్ లోనే వేసేస్తుంటారు. గోధుమలను బాగా కడిగి, ఆరబెట్టి, పిండి పట్టించినా.. ఎందుకు పురుగులు పడతాయని చాలా మంది అనుకుంటుంటారు. అసలు గోధుమ పిండికి పురుగులు ఎందుకు పడతాయి? ఏం చేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గోధుమ పిండికి పురుగులు ఎందుకు పడతాయి? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేయాలి:

గోధుమ పిండికి పురుగులు పట్టడానికి అసలు కారణం గాలి. అవును పిండికి గాలి తగిలితే పిండికి పక్కాగా పురుగులు పడతాయి. అందుకే పురుగులు పట్టకుండా ఉండాలంటే గోధుమ పిండిని గాలి వెల్లని డబ్బాలో నిల్వ చేయాలి. డబ్బా మూత టైట్ గా ఉంటే పిండికి గాలి తగలదు. పురుగులు పట్టవు. 

ఎండకు పెట్టాలి:

గాలి వెళ్లని డబ్బాలో గోధుమ పిండిని నిల్వ చేసినా దీన్ని అప్పుడప్పుడు తీసి ఎండలో పెట్టాలి. ఎందుకంటే పిండి డబ్బాలో ఉన్నా తేమగా అవుతుంది. దీనివల్ల పిండిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే పురుగులూ ఏర్పడతాయి. 

గాజు సీసాలో నిల్వ చేయాలి:

గోధుమ పిండికి పురుగులు పట్టకుండా, పాడవకుండా ఉండాలంటే గాజు సీసాలో నిల్వ చేయండి. దీనివల్ల గోధుమ పిండి 10 నెలలైనా ఫ్రెష్ గా, పురుగులనేవి లేకుండా ఉంటుంది. అయిత మీ ఇంట్లో గాజు సీసా లేకపోతే గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో అయినా నిల్వ చేసుకోండి. 

బిర్యానీ ఆకు & లవంగాలు:

గోధుమ పిండికి పురుగులు పట్టకుండా చేయడంలో లవంగాలు, బిర్యానీ ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం కొన్ని బిర్యానీ ఆకులు, లవంగాలను గోధుమ పిండిలో వేయండి. అలాగే వేప ఆకులు వేసినా కూడా గోధుమ పిండికి పురుగులు, చీడపురుగులు పట్టవు. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. 

సంచిలో నిల్వ చేయొద్దు:

గోధుమ పిండిని సంచిలో నిల్వ చేస్తే వెంటనే చాలా తొందరగా పురుగులు పడతాయి. కాబట్టి సంచిలోంచి వెంటనే డబ్బాలోకి పోయండి. ఎందుకంటే సంచులు తేమను పీల్చుకుంటాయి. దీనివల్ల పిండి తేమగా అయ్యి దానిలో పురుగు ఏర్పడుతుంది.

పాత పిండిలో కొత్త పిండిని కలపకండి:

చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. కానీ పాత గోధుమ పిండిలో కొత్త గోధుమ పిండిని అస్సలు కలపకూడదు. ఒకవేల మీరు డబ్బాలో పాత గోధుమ పిండి ఉంటే దాన్ని వేరే దాంట్లోకి మార్చి అందులో కొత్త గోధుమ పిండిని వేయండి. ఎందుకంటే పాత పిండితో కొత్త పిండిని కలిపితే పురుగులు ఏర్పడతాయి. పిండి మొత్తం పాడైపోతుంది.

డబ్బాలో తేమ ఉండకూడదు:

మీరు గోధుమ పిండిని నిల్వ చేసే డబ్బాలో తేమ అస్సలు ఉండకూడదు. కాబట్టి గోధుమ పిండిని నిల్వ చేసే డబ్బాను ఒకటికి రెండు సార్లు పొడి గుడ్డతో తుడవండి. ఎందుకంటే తేమ ఉంటే గోధుమ పిండి త్వరగా పాడైపోతుంది. దీనివల్ల పురుగులు ఏర్పడతాయి.