వేసవికాలంలో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండల వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి చలువ చేసే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. మరి వేసవిలో అస్సలే తినకూడని ఆహారాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

వేసవి కాలం మొదలైంది. ఈ సీజన్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరం. శరీరంలో కొంచెం నీటి శాతం తగ్గినా చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

సాధారణంగా వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చల్లని ఆహారాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ఈ సీజన్‌లో మనం తినే ఆహారాలపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం పాడవుతుంది. వేసవిలో తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో తినకూడని ఆహారాలు:

1. వేయించిన మాంసం

వేసవిలో కొంతమంది గ్రిల్ చేసిన మాంసం తింటుంటారు. అది మీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. ఈ ఆహారాలు చాలా ఎక్కువ వేడిలో వండుతారు. ఇప్పటికే వేడిగా ఉండటం వల్ల ఎక్కువ వేడిలో వండిన ఆహారం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది.

2. ఐస్ క్రీమ్

వేసవిలో మనమందరం ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీంను చాలా ఇష్టంగా తింటారు. కానీ వేసవిలో ఐస్ క్రీం తినడం మంచిది కాదు. ఎందుకంటే ఐస్ క్రీంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఊబకాయం, షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఐస్ క్రీం తినాలనుకుంటే అప్పుడప్పుడు మాత్రమే తినండి.

3. ఆల్కహాల్

కొంతమంది వేసవిలో చల్లటి వైన్ లేదా ఐస్ వేసిన మద్యం తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇలా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి డీహైడ్రేషన్ వస్తుంది. అంతేకాకుండా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అనారోగ్యం పాలయ్యే ప్రమాదం పెరుగుతుంది.

4. పాల ఉత్పత్తులు

వేసవిలో మీరు ఎక్కువగా చల్లటి మిల్క్ షేక్ తాగడానికి ఇష్టపడితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సీజన్‌లో పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోకూడదు. ఈ సీజన్‌లో శరీర వేడి కారణంగా పాలు, వెన్న లేదా చీజ్ లాంటి పాల ఉత్పత్తులు జీర్ణం కావడం కష్టం అవుతుంది.

5. నూనె పదార్థాలు

నూనె పదార్థాలు, జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు వేసవిలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇవి శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీని కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలవుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.

6. డ్రై ఫ్రూట్స్

బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర్, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, వాటిని వేసవిలో తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ శరీరాన్ని లోపలి నుంచి వేడి చేస్తాయి. కాబట్టి వేసవిలో డ్రై ఫ్రూట్స్‌ను చాలా తక్కువగా తినండి.

7. టీ, కాఫీ

చాలా మంది ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేరు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే దాన్ని మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వేసవిలో టీ, కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. వాటికి బదులుగా గ్రీన్ టీ తాగవచ్చు.

8. మసాలా దినుసులు

యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు లాంటి మసాలా దినుసులు ఆహారం రుచిని పెంచుతాయి. అయితే ఈ మసాలా దినుసుల్లో వేడి ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో వీటిని తింటే డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యం పాలవుతారు. కాబట్టి వేసవిలో మసాలా దినుసులు ఎక్కువగా వేయని ఆహారాలు తినండి.

9. మామిడి పండు

వేసవిలో మామిడి పండు తినడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ఇది ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వేసవిలో ఎక్కువగా మామిడి పండు తింటే కడుపు నొప్పి, విరేచనాలు, తలనొప్పి వస్తాయి. కాబట్టి తక్కువ మొత్తంలో మాత్రమే తినండి.

10. ఉప్పు

ఉప్పు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ, వేసవిలో ఎక్కువ ఉప్పు తినడం వల్ల వాపు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సోడియం ఎక్కువగా శరీరంలో చేరితే కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.