జపాన్ దేశంలో ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా ఎక్కించేలా కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. రాబోయే కాలంలో ఇది విప్లవాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఎంతోమందికి ఈ బ్లడ్ వల్ల ప్రాణాలు నిలబడవచ్చు. జపాన్ వైద్య రంగంలో ఇది గేమ్ చేంజర్ గా మారబోతున్నట్టు చెబుతున్నారు.
మన శరీరంలో రక్తం ఎంతో ముఖ్యమైనది. ఇది మన ప్రాణంలో అంతర్భాగం. ప్రపంచంలో ఎంతోమంది రక్తహీనత కారణంగా మరణిస్తున్నారు. గాయాలు తగిలినప్పుడు, యాక్సిడెంట్ల జరిగినప్పుడు రక్తపాతం అధికంగా జరిగి సరైన సమయానికి రక్త అందక మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. గాయపడిన వ్యక్తి రక్త గ్రూపునకు చెందిన బ్లడ్ గ్రూపు వారిని వెతికి తెచ్చే లోపే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలాంటి మరణాలను ఆపేందుకే జపాన్ శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని సృష్టించారు. ఈ రక్తం ఊదా రంగులో ఉంటుంది. ఈ కృత్రిమ రక్తాన్ని హిమోగ్లోబిన్ వెసికిల్స్ అని పిలుస్తారు.
ఈ రక్తంలో నో వైరస్
ఈ కృత్రిమ రక్తం మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ ను అందించగలదు. దీని సాంకేతికత లిపిడ్ పొరల్లో చుట్టిన నానోసైజ్ హిమోగ్లోబిన్ కణాలను కూడా ఉపయోగించుకొని... కృత్రిమ కణాల వలె అద్భుతంగా పనిచేస్తుందని జపాన్ వైద్యులు చెబుతున్నారు. ఈ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. అందుకే దీన్ని సార్వత్రిక రక్తం అని కూడా పిలుస్తారు. అంటే ఏ రక్త వర్గానికి చెందిన వారికైనా ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కించినా కూడా ఎలాంటి సమస్యలు రావు. ఎందుకంటే ఈ రక్తంలో ఎలాంటి వైరస్ ఉండదు. దీనివల్లే హెచ్ఐవి, హెపటైటిస్ వంటి సమస్యలు పెరిగే లేదా వ్యాప్తి చెందే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
రెండేళ్ల పాటూ నిల్వ ఉండే రక్తం
ఈ రక్తాన్ని నిల్వ చేయడం కూడా చాలా సులువు. ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే రెండు సంవత్సరాల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ కృత్రిమ రక్తం మనిషి ప్రాణాన్ని కాపాడడంలో కచ్చితంగా మాయాజాలాన్ని చేస్తుందని జపాన్ వైద్యశాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ కృత్రిమ రక్తం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా సులువుగా రవాణా చేయవచ్చు. ఏదైనా తీవ్రమైన విపత్తులు సంభవించినప్పుడు ఈ కృత్రిమ రక్తం భారీగా అవసరం పడుతుంది. కాబట్టి ఇది కచ్చితంగా భవిష్యత్తు వైద్య రంగంలో గేమ్ ఛేంజర్ గా మారుతుందని వైద్య శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
ప్రస్తుతం బ్లడ్ గ్రూపుల్లో రెండు ప్రధాన వ్యవస్థలుగా విభజించారు. ABO అనేది ఒక రక్త వర్గ వ్యవస్థ అయితే మరొకటి Rh. ABO వ్యవస్థలో A, B, AB, O... రక్త వర్గాలు ఉంటాయి. అదే Rh వ్యవస్థలో Rh పాజిటివ్, Rh నెగిటివ్ బ్లడ్ గ్రూపులు ఉంటాయి.
Rh బ్లడ్ గ్రూపు కలిగి ఉన్న వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. రక్తంలో Rh యాంటిజెంట్ ఉంటే ఆ రక్తాన్ని Rh పాజిటివ్ గా పరిగణిస్తారు. ఒకవేళ రక్తంలో Rh యాంటీజెన్ లేకపోతే ఆ రక్తాన్ని Rh నెగిటివ్ గా చెబుతారు.
ప్రస్తుతం రక్తాన్ని మార్పిడి చేసే సమయంలో దాతకు, గ్రహీతకు రక్త వర్గాలు సరిపోలకపోతే రోగి తీవ్రమైన అనారోగ్యం బారిన పడతారు. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అందుకే జపాన్ వైద్యశాస్త్రవేత్తలు ఎవరికైనా సరిపోయేలా ఈ కృత్రిమ రక్తాన్ని సృష్టించారు. ప్రస్తుతం ఇది ఇంకా జపాన్ దేశంలోనే ట్రయల్స్ దిశలో ఉంది. అన్ని దశలను దాటి ఇది విజయవంతంగా వైద్య రంగంలోకి అడుగుపెడితే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. జపాన్ నుంచి ఇతర దేశాలకు కూడా ఈ కృత్రిమ రక్తం ఎగుమతి అయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. రక్త కొరత కారణంగా ఏ ప్రాణం పోకుండా కాపాడే శక్తి ఈ కృత్రిమ రక్తానికి ఉంటుంది.
