కరోనావైరస్‌ కారణంగా టాలీవుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన అనేక సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పట్లో సినిమా రిలీజ్ లు లేవనుకున్న సమయంలో అందరిని ఆశ్చర్యపరుస్తూ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన టెనెట్‌ సినిమాలను విడుదల చేశారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికీ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26  ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా రిజల్ట్ కోసం చాలా మంది పెద్ద నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ పెద్ద దిక్కు.

225 మిలియన్‌ డాలర్లతో వార్నర్‌ బ్రదర్స్‌ టెనెట్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే కొన్ని హాలీవుడ్‌ సినిమాలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియక ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నా.. నోలన్‌ మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సైన్స్‌ఫిక్షన్ స్పై డ్రామా గా రూపొందిన ఈ సినిమా కరోనా భయంతో జనం థియోటర్స్ కు రావటానికి ధైర్యం చేయకపోవటంతో నార్త్ మార్కెట్ అంటే యుఎస్, కెనడాలలో పూర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు అంత పెద్ద క్రిస్టోఫర్ నోలన్ డైరక్ట్ చేసిన సినిమాకే దిక్కులేదు..ఇక మన సినిమాలను ఇప్పుడు థియోటర్స్ ఓపెన్ చేసి రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు అనే డిస్కషన్ టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ లో మొదలైందని సమాచారం. ఓవర్ సీస్ మార్కెట్ పై పూర్తి ఆశలు వదిలేసుకోవాలని అర్దమైంది అంటున్నారు. 

ఇక కాలంతో ప్రయోగ చిత్రాలు చేస్తూ హాలీవుడ్‌లో, అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేశారు దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్. ఆయన చిత్రాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఇందుకు ‘ఇన్‌సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే కారణం. ఇటీవల కాలంతో నోలన్‌ చేసిన మరో ప్రయోగమే ‘టెనెట్‌’. ఓ వ్యక్తికి భవిష్యత్తును చూడటంతోపాటు కాలాన్ని వెనక్కి తిప్పడమూ తెలుస్తుంది. అతడే జరగబోయే ప్రపంచ యుద్ధాన్ని ఆపడం కోసం అంతర్జాతీయ గూఢచర్యానికి పాల్పడుతుంటాడు.

 ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లే ఇతి వృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధంలో పొంచివున్న అణుధార్మిక ప్రమాదం గురించి ఈ సినిమాలో చూపించారు. అయితే ఇంత ఆసక్తి రేపిన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావటం సినీ జనాలను షాక్ కు గురి చేస్తోంది.