బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోతో మరోసారి ట్రాక్‌లోకి వచ్చిన శివాజీ ఇప్పుడు హీరోగా బిజీ అవుతున్నాడు. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రారంభమైంది.  

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు శివాజీ. అంతకు ముందు హీరోగా చేసి అనేక విజయాలు అందుకున్నారు. కామెడీ హీరోల్లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని అలరించారు. మంచి పీక్‌ టైమ్‌లోనే రాజకీయాలంటూ డైవర్ట్ అయ్యాడు. కొంత కాలం అసలు సినిమాలకే దూరమయ్యాడు. ఇటీవల `బిగ్‌ బాస్‌ షోతో మళ్లీ ఆయన ట్రాక్‌ ఎక్కాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. మరో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించాడు. 

శివాజీ హీరోగా `దండోరా`

బలమైన పాత్రలతోనే ఆయన కమ్‌ బ్యాక్‌ కావాలనుకుంటున్నాడు. అయితే ఇప్పటికే వెబ్‌ సిరీస్‌తో మెప్పించాడు. `90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` సిరీస్‌లో నటించి హిట్‌ అందుకున్నాడు. దీనికి రెండో సీజన్‌ కూడా రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఆయన హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. `దండోరా` పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీ బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. మురళీకాంత్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం `క‌ల‌ర్ ఫోటో`, అలాగే `బెదురులంక 2012` చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

`దండోరా` గ్రాండ్‌ ఓపెనింగ్‌

`దండోరా` సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రై చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా, బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.

`దండోరా` సినిమా స్టోరీ, ఆర్టిస్టులు

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించ‌నున్నారు. మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుందని టీమ్‌ తెలిపింది. చేసే పనిని బట్టి కులం అన్నప్పుడు, పని మారితే కులం మారాలి కదా!` అనే ఆలోచింప చేసే ట్యాగ్‌ లైన్‌తో పోస్టర్‌ని విడుదల చేశారు. పల్లెటూరి తలపించేలా ఉన్న ఈ కొత్త పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది. ఈ మూవీతో శివాజీ తన వింటేజ్‌ శివన్నని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన కామెడీ సినిమాలతో అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి వినోదాన్ని అందించబోతున్నట్టు టీమ్ తెలిపింది. 

`దండోరా` ఆర్టిస్టులు, టెక్నీషియన్లు

విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు న‌వ‌దీప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ర‌వికృష్ణ‌, మ‌నీక చిక్కాల‌, అనూష త‌దిత‌రులు ప్ర‌ధాన కనిపించబోతున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ భోగ‌వ‌ర‌పు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వ‌ర్డ్ స్టీవ్‌స‌న్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

read more: `పుష్ప 3` కాదు, సందీప్‌ వంగా కాదు.. అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఎవరితో తెలుసా? అస్సలు ఊహించలేరు

also read: కీర్తిసురేష్‌ పెళ్లి సందడి షురూ, స్పెషాలిటీ ఏంటంటే? ఈ రహస్యానికి కారణమదేనా?