రియా చక్రవర్తి తమ్ముడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ ఆరోపణలపై షోవిక్ తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ శ్యామ్యూల్ మిరండాలను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న వీరిని కోర్ట్ లో హాజరుపరిచిన అధికారులు, వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ డీలర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలియడంతో పాటు, డ్రగ్స్ వాడారన్న ఆధారాలు దొరకడంతో వీరిని అరెస్ట్ చేశారు. 

షోవిక్ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి తన సిస్టర్ రియా క్రెడిట్ కార్డ్ వాడినట్లు ఆధారాలు దొరికాయి. దీనితో తరువాత అరెస్ట్ కాబోయేది రియా చక్రవర్తే అంటూ జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు. కొడుకు అరెస్ట్ పట్ల తీవ్ర ఆవేదన, నిరసన  వ్యక్తం చేశారు. ఈ కేసుతో తన కుటుంబాన్ని నాశనం చేశారని మొత్తం దేశాన్నే ఆయన నిందించారు. ఒక మధ్య తరగతి కుటుంబాన్ని అందరూ కలిసి కూలదోశారని ఆక్రోషం వెళ్లగక్కారు. 

'నాకొడుకును అరెస్ట్ చేసినందు కంగ్రాట్స్ ఇండియా, ఆ తరువాత అరెస్ట్ చేయబోయేది నా కూతురినే అని నాకు తెలుసు. ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్ధవంతంగా కూలదోశారు. న్యాయం జరగాలంటే ఇవన్నీ తప్పవు జై హింద్' అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దేశం మొత్తం కక్షగట్టి తన కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారన్న అర్థంలో రియా తండ్రి బాధపడ్డారు. ఇక నిన్న విచారణలో షోవిక్ తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు, బాలీవుడ్ లో కొందరు ప్రముఖులకు కూడా సప్లై చేసేవాడినని అని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.