Ranabaali: తన కొత్త సినిమా 'రణబాలి' షూటింగ్ సెట్‌లో ఏదో 'చాలా భయంకరంగా' జరుగుతోందని రష్మిక మందన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ అది 'దైవకమని' సరదాగా కామెంట్ చేశారు. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. 

నటి రష్మిక మందన్న తన అప్‌కమింగ్ మూవీ 'రణబాలి' సెట్ నుంచి ఓ వీడియో షేర్ చేసి, అక్కడ 'చాలా భయంకరంగా' ఏదో జరుగుతోందని చెప్పి అందరిలో ఆసక్తిని పెంచేసింది. దీనిపై ఆమె భర్త, హీరో విజయ్ దేవరకొండ ఫన్నీగా స్పందిస్తూ, అది 'భయంకరం' కాదు 'దైవకం' అని కామెంట్ పెట్టాడు.

రష్మిక షేర్ చేసిన 'రణబాలి' సెట్ వీడియో

రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'రణబాలి' సెట్ నుంచి ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. "ఈ వీడియో ఇప్పుడు మీకు చూపించొచ్చో లేదో నాకు తెలీదు.. ఎప్పటిలాగే దీన్ని తీసేయమని వాళ్లు చెప్పరని అనుకుంటున్నా.. కానీ ఈ కుర్రాళ్లు చాలా భయంకరమైనది ఏదో చేస్తున్నారు. నేను సైలెంట్‌గా ఉండలేకపోయాను.. దీన్ని పెద్ద తెరపై చూడటానికి ఆతృతగా ఉన్నా` అని రాసుకొచ్చింది.

ఈ పోస్ట్‌పై విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు. సరదాగా ఆమెకి రిప్లై ఇస్తూ, 'క్యూటీ. భయంకరం కాదు - దైవకం' అని కామెంట్ పెట్టాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ హిస్టారికల్ సినిమా 'రణబాలి'ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి, మేకర్స్ అదిరిపోయే క్యారెక్టర్ పోస్టర్లు, పాటలు, స్పెషల్ గ్లింప్స్‌లు రిలీజ్ చేస్తూ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నారు.

హిస్టారికల్‌ యాక్షన్ సినిమా 'రణబాలి'

"బ్రిటిష్ పాలన కాలంలో, మన దేశ చరిత్రలో ఎవరికీ పెద్దగా తెలియని ఒక కథ ఆధారంగా 'రణబలి' సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. ఇది ఒక భారీ హిస్టారికల్ యాక్షన్ సినిమా. ఇందులో విజయ్ దేవరకొండ ఒక శక్తివంతమైన యోధుడి పాత్రలో, రష్మిక మందన్న ఆయన భార్య జయమ్మ పాత్రలో నటిస్తున్నారు," అని నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన వై. రవిశంకర్, నవీన్ యెర్నేని.. టీ-సిరీస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. 'రణబలి' చిత్రంలో అంతర్జాతీయ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

 రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు. `గీత గోవిందం` పెద్ద హిట్‌ అయ్యింది. విజయ్‌ని స్టార్‌ని చేసింది. ఈ మూవీతోనే రష్మిక కూడా స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత `డియర్‌ కామ్రేడ్‌` చేయగా, అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడో సినిమాతో హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.