ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది నటులు దర్శకులుగా మారారు, చాలామంది దర్శకులు యాక్టింగ్ లోకి వచ్చారు. తాజాగా మరో స్టార్ నటుడు దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. ఆయన ఎవరో కాదు స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ.

తెలుగు సినిమా అభిమానులకు నటుడిగా బాగా పరిచయమైన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, లాంటి సినిమాలలో సీరియస్ క్యారెక్టర్స్ చేసి.. 'జాతిరత్నాలు' వంటి విజయవంతమైన చిత్రాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రామకృష్ణ.. తన హాస్యంతో పాటు సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మల్టీ టాలెంటెడ్ అని ఇప్పటికే నిరూపించుకున్న రాహుల్, ఈసారి దర్శకుడిగా మారేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

ఈ విషయాన్ని ఆయన ఈరోజు (జూన్ 14) ఉదయం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. 'ఎక్స్' లో ఒక పోస్ట్‌ ద్వారా ఈ విషయం తెలియజేస్తూ.. ఈ విధంగా రాశారు. దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్‌. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్‌, ఫొటోల‌ను నా మెయిల్‌కు పంపించండి, అని పేర్కొన్నారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఇక టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, రాహుల్ రామకృష్ణ తన కథను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే సినిమా కథ, హీరో హీరోయిన్లు, సాంకేతిక బృందం వంటి ఇతర వివరాలు ఇప్పటికీ సీక్రేట్ గానే ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం.

Scroll to load tweet…

గతంలో రచయితగా, జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఉన్న రాహుల్‌కి కథనంపై మంచి పట్టుంది. అర్జున్ రెడ్డి సినిమాలోని శివ పాత్రతో రాహుల్ సినిమా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. 2017లో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన, గీత గోవిందం, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి అనేక సినిమాల్లో అద్భుతంగా నటించి అభిమానులను సంపాదించుకున్నారు.

నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన రాహుల్, దర్శకత్వంలో కూడా అదే స్థాయిలో ప్రత్యేకత చూపించబోతున్నట్టు తెలుస్తోంది. రాబోయే నెలల్లో ఈ సినిమా వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నటన కోసం ఆసక్తిగల వారు తమ వివరాలను పంపాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.