ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుబేర’ చిత్రం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ చిత్రంలో ధనుష్ నట విశ్వరూపం ప్రదర్శించాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
కుబేర చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుబేర’ చిత్రం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సోషల్ డ్రామా చిత్రం జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి షో నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల అభిమానాన్ని కూడా గెలుచుకుంటోంది.
ఈ చిత్రంలో ధనుష్ నట విశ్వరూపం ప్రదర్శించాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంట్ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో ధనుష్ ఒకరు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ధనుష్ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ చిత్రంతో ధనుష్ క్రేజ్ మరో స్థాయికి చేరుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రష్మిక మందన్నా, నాగార్జున అక్కినేని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. నాగార్జున పోషించిన పాత్ర కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. పాలిటిక్స్, మనీ, పవర్ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ఎంగేజింగ్ కథ రాసుకుని సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కుబేర మూవీపై నాగ్ అశ్విన్ ప్రశంసలు
అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా దాదాపు హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది ఒక సామాజిక చిత్రానికి అరుదైన ఓపెనింగ్‌గానే చెప్పాలి. ఈ విజయోత్సాహాన్ని మరింత పెంచుతూ, ‘కల్కి 2898 ఏ.డి.’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రం చూసిన అనంతరం ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని మాస్టర్ పీస్ అని అభివర్ణిస్తూ ఇంకా ఘాటైన కామెంట్ ని తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నాడు. “ఏమీ ఆలోచించకుండా వెంటనే వెళ్లి చూడండి” అంటూ సూచించారు.

నాగ్ద అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. అలాంటి దర్శకుడి నుంచి ప్రశంసలు రావడం ఈ చిత్రంపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. విమర్శకులు అయితే శేఖర్ కమ్ముల తన కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా ‘కుబేరా’ను నిలిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మ్యాజిక్ చేసిన శేఖర్ కమ్ముల
ఇటీవల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో ‘కుబేరా’ థియేటర్లకు మళ్లీ జోష్ తీసుకొచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కథాంశం, నటీనటుల ప్రదర్శన, భావోద్వేగాలు, సామాజిక సందేశం ఇలా అన్ని అంశాల్లో ఈ చిత్రం ప్రేక్షకులని అలరించే విధంగా ఉందని అంటున్నారు.
శేఖర్ కమ్ముల ఈ చిత్రంలో బినామీ వ్యవస్థ, మనీ లాండరింగ్ ఎలా ఈ దేశంలో ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలని అద్భుతంగా చూపించారు. మాజీ సీబీఐ అధికారి పాత్రలో నాగార్జున పెర్ఫార్మెన్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంది.
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ‘కుబేరా’ విజయవంతమైన తొలి రోజుతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా, లవ్ స్టోరీ లాంటి ప్రేమ కథా చిత్రాల తర్వాత ఇలా సామాజిక అంశాలు ఉన్న కథని ఎంచుకోవడం సాహసమే. కానీ ఆ సాహసాన్ని శేఖర్ కమ్ముల సమర్థవంతంగా పూర్తి చేశారు.
