మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి హంగామా మొదలు కాబోతోంది. సైరా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా. పైగా దక్షణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో ప్రమోషన్స్ దాదాపు నెలరోజుల ముందు నుంచే మోతెక్కాలి. తెలుగులో మెగాస్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఆటోమాటిక్ గా సినిమాపై బజ్ ఏర్పడుతుంది. కానీ అసలు ఛాలెంజ్ మొత్తం హిందీ, మిగిలిన ఇతర భాషల్లో ఉంది. 

సైరా చిత్రానికి మరో ఎదురుదెబ్బ ఏంటంటే ఈ చిత్రం విడుదల కాబోతున్న రోజునే హిందీలో క్రేజీ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ విడుదల కాబోతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వార్ చిత్ర ప్రచార కార్యక్రమాలని అదరగొడుతోంది. కానీ సైరా చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్లేలా నిర్మాతలు ఏమీ చేయలేదు. 

ఇదే అంశం ఇప్పుడు మెగా అభిమానులని కలవరపెడుతోంది. ఇదే సైరా చిత్రాన్ని మరో నిర్మాత నిర్మించి ఉండే.. వారిపై అభిమానులు ఇప్పటికే విరుచుకుపడేవారు. ప్రమోషన్స్ ఏవని ప్రశ్నించేవారు. కానీ సైరా చిత్రాన్ని నిర్మిస్తోంది స్వయంగా రాంచరణే. తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ తో అయినా ప్రమోషన్స్ వేగం పుంజుకుంటాయి అని భావిస్తే అది కాస్తా సెప్టెంబర్ 22కు వాయిదా పడింది. వార్ మూవీ ఆషామాషీగా విడుదలవుతున్న చిత్రం కాదు. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని 200 కోట్లకు పైగా బడ్జెట్ తో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు. 

ఇక హృతిక్, టైగర్ ష్రాఫ్ సినిమాల కోసం హిందీ ప్రేక్షకులు ఎగబడతారు. వారందరిని సైరా థియేటర్స్ లోకి రప్పించడం రాంచరణ్, చిరంజీవి ముందున్న బిగ్ టాస్క్. సైరాలో బిగ్ బి అమితాబ్ నటించడం కాస్త కలసి వచ్చే అంశం. అన్ని భాషలలో బుధవారం రోజు ట్రైలర్ విడుదల కాబోతోంది. ట్రైలర్ తో అయినా హిందీలో సైరాపై అంచనాలు పెరుగుతాయేమో చూడాలి. 

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!